కానుకలు వచ్చేశాయ్‌!

27 May, 2019 09:03 IST|Sakshi
గిఫ్ట్‌ ప్యాక్‌లను పరిశీలిస్తున్న జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి

బేల/ఆదిలాబాద్‌రూరల్‌: రంజాన్‌ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు ప్రభుత్వం తరపున గిఫ్ట్‌ ప్యాక్‌లు వచ్చేశాయ్‌. ఈ నెల 7వ తేదిన రంజాన్‌ నెల ప్రారంభం కాగా  జిల్లాలోని పేద ముస్లింలకు ఈ గిఫ్ట్‌ల పంపిణీతో పాటు ఈఫ్తార్‌ విందుల నిర్వహణ కోసం ఇప్పటికే మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు మొత్తం 4,500గిఫ్ట్‌ ప్యాక్‌లు చేరుకున్నాయి. ఈ నెల 18వ తేదీన వీటి పంపిణీ ప్రారంభానికి సన్నాహాలు చేసినప్పటికీ, అనివార్య కారణాలతో కుదరలేదని తెలిసింది. ఎట్టకేలకు 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా 61మసీదుల వద్ద వీటిని ఒకేసారి పంపిణీ చేయడానికి సంసిద్ధత కొనసాగుతోంది. దీంతో పాటు ఈ 28వ తేదీ సాయంత్రమే జిల్లాలోని ఆదిలాబాద్‌ నియోజకర్గంలోని 19, బోథ్‌ నియోజకవర్గంలోని 9 మసీదుల వద్ద ఇఫ్తార్‌ విందులను సైతం ఏర్పాటు చేయనున్నారు.

గిఫ్ట్‌ ప్యాక్‌లను అందిస్తారిలా..
రంజాన్‌ ఉపవాసాల నేపథ్యంలో నిరుపేద ముస్లిం  కుటుంబాలకు గిఫ్ట్‌ ప్యాక్‌లు అందించేందుకు జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ గిఫ్ట్‌ ప్యాక్‌లో ఒక చీర, సల్వార్‌ కమీజ్, కుర్తపైజామా, ఒక బ్యాగు ఉండనున్నాయి. స్థానిక మసీదు కమిటీల నిర్వాహకులు ఎంపిక చేసిన కుటుంబాలకే వీటిని అందించనున్నారు. ఎంపిక విధానంలో ఈ ఏడాది రేషన్‌ కార్డు ఆధారంగా లబ్ధిదారుడి ఎంపిక చేసి టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లను ఒక రోజు ముందుగానే అందజేసి, గిఫ్ట్‌ ప్యాక్‌లను అందిస్తారు. ఈ గిఫ్ట్‌ ప్యాక్‌ల పంపిణీపై ఏసీబీ నిఘా సైతం ఉండనుంది.

ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా పూర్తిస్థాయిలో మైనార్టీ అధికారులు పారదర్శకంగా మసీదు కమిటీ నిర్వాహకుల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ప్రధానంగా వితంతులు, ఒంటరి మహిళలు, అనాథలు, నిరుపేదలకు ఈ ప్రతిపాదనలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాగా మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై ఏసీబీ నజర్‌ ఉంచుతున్న విషయం తెలిసిందే. లబ్ధిదారులు తమ రేషన్‌ కార్డులను మసీదు కమిటీ నిర్వహకులకు ఇచ్చి, గిఫ్ట్‌ ప్యాక్‌లు తీసుకున్నట్లు పేపర్‌పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. మసీదు కమిటీ ఎంపిక చేసిన ప్రాంతంలో పోలీసులు, మైనార్టీ శాఖ అధికారులు మసీదు కమిటీ సమక్షంలో వీటిని పంపిణీ  చేయనున్నారు. తమ పవిత్ర పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఈ గిఫ్ట్‌ ప్యాక్‌లు పంపించడంతో ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పంపిణీకి ఏర్పాట్లు చేశాం
నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఈ గిఫ్ట్‌ ప్యాక్‌లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే జేసీ సమక్షంలో మసీదు కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. ప్రభుత్వం తరపున అందిస్తున్న ఈ గిఫ్ట్‌ ప్యాక్‌ల పంపిణిని పారదర్శకంగా నిర్వహించనున్నాం. ఈ నెల 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఈ గిఫ్ట్‌ ప్యాక్‌ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. – కృష్ణవేణి, జిల్లా మైనార్టీ శాఖ అధికారి 

మరిన్ని వార్తలు