పల్లెలు మెరవాలి

5 Sep, 2019 08:34 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌

మండలానికి ఒకరు చొప్పున ప్రత్యేక నోడల్‌ అధికారి 

30 రోజుల ప్రణాళిక అమలుపై అధికారులకు ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ మార్గనిర్దేశనం 

సాక్షి, రంగారెడ్డి : 30రోజుల ప్రణాళికలో భాగంగా  శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పంచాయతీల ప్రత్యేక కార్యాచరణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌ సూచించారు. పల్లెలను పరిశుభ్రంగా, పచ్చదనంగా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యం కావాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణపై జిల్లాస్థాయి అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడుతూ.. ప్రతి మండలానికి నియమించిన ప్రత్యేక నోడల్‌ అధికారి.. చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలన్నారు. పూర్తిచేసిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు డీపీఓకు తెలియజేయాలన్నారు.  ప్రతిఇంటి ఆవరణలో నాటుకునేందుకు వీలైన మొక్కలను అందజేయాలన్నారు.  వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించి గ్రామసభల ఆమోదం తీసుకోవాలని సూచించారు. ఈ ప్రణాళికను అనుగుణంగానే బడ్జెట్‌ రూపొందించాలని చెప్పిన ఆయన.. అప్పులు, జీతాలు, కరెంటు బిల్లుల చెల్లింపు ఖర్చులను వ్యయం పద్దులో చూపెట్టాలన్నారు. ప్రతి ఇంటికి, ఆస్తికి కచ్చితమైన విలువ కట్టి క్రమం తప్పకుండా ఆస్తుల విలువ మదింపు చేయాలన్నారు. దీనికి అనుగుణంగా పన్నులు వసూలు చేయాలన్నారు.

ప్రత్యేక నోడల్‌ అధికారుల నియామకం.. 
పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక నోడల్‌ అధికారులుగా నియమించారు. 21 గ్రామీణ మండలాలకు ఒకరి చొప్పున నియమిస్తూ ఇన్‌చార్జి కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. గురువారం ఎంపీడీఓల సమక్షంలో ప్రత్యేక నోడల్‌ అధికారులు.. అన్ని పంచాయతీలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. ఆమనగల్లు – జి.ప్రశాంతి (జిల్లా ఉపాధి అధికారిణి), అబ్దుల్లాపూర్‌మెట్‌ – డాక్టర్‌ సునందారాణి (జిల్లా ఉదాన్యశాఖ అధికారిణి), చేవెళ్ల – డాక్టర్‌ కేవీఎల్‌ నర్సింహారావు (జిల్లా పశుసంవర్థకశాఖ అధకారి), ఫరూఖ్‌నగర్‌– ఓం ప్రకాశ్‌ (జిల్లా ప్రణాళికాధికారి), చౌదరిగూడం – ఎ.వెంకటరమణ (వయోజన విద్యాశాఖ డీడీ), కడ్తాల్‌ – రత్నకల్యాణి (జిల్లా మైనారిటీ అభివృద్ధిశాఖ అధికారిణి), కందుకూరు – సత్యనారాయణరెడ్డి (జిల్లా విద్యాశాఖాధికారి), కేశంపేట –చంద్రారెడ్డి (జిల్లా భూగర్భజలశాఖ అధికారి), కొందుర్గు – జానకిరెడ్డి (జెడ్పీ అకౌంట్స్‌ ఆఫీసర్‌), మాడ్గుల – ప్రవీణ్‌రెడ్డి (గనులశాఖ అధికారి), మహేశ్వరం – రాజేశ్వర్‌రెడ్డి (జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం), మంచాల – దివ్యజ్యోతి (ఆత్మ పీడీ), మొయినాబాద్‌ – గీతారెడ్డి (జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి), శంకర్‌పల్లి –ప్రశాంత్‌కుమార్‌ (డీఆర్‌డీఓ), శంషాబాద్‌ – బోజరాజు (మెప్మా పీడీ), తలకొండపల్లి – వెంకట్రాంరెడ్డి (డీఆర్‌డీఏ అదనపు పీడీ), ఇబ్రహీంపట్నం – సుకీర్తి (మత్స్యశాఖ అధికారిణి), షాబాద్‌ – అంజయ్య (జిల్లా సహకారశాఖ అధికారి), కొత్తూరు–ఛాయాదేవి (మార్కెటింగ్‌ శాఖ ఏడీ), నందిగామ–ఎన్‌.మోతీ (జిల్లా సంక్షేమాధికారిణి), యాచారం – జ్యోతి (మార్క్‌ఫెడ్‌ డీఎం)లను ప్రత్యేక నోడల్‌ అధికారులుగా నియమితులయ్యారు.

మార్గదర్శకాలు జారీ.. 
పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక అమలులో కీలకమైన కోఆప్షన్, పంచాయతీ  స్థాయీ సంఘాల కమిటీలను నియమించేందుకు ఇన్‌చార్జి కలెక్టర్‌ మార్గదర్శకాలు జారీచేశారు. ఒక్కో జీపీకి ముగ్గురు చొప్పున కోఆప్షన్‌ సభ్యులు, నాలుగు చొప్పున స్టాండింగ్‌ కమిటీలను నియమించాలని సూచించారు. వీటి నియామకంలో పాటించాల్సిన నిబంధనలను పేర్కొంటూ ఎంపీడీఓలకు సర్క్యులర్‌ జారీచేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా