ఎన్నికలకు రెడీ..

17 Oct, 2018 12:22 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌ కుమార్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నాం. ఓటర్ల తుది జాబితా విడుదలతో కీలకఘట్టం ముగిసింది. ఇక ఎన్నికల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాం అని జిల్లా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ హరీశ్, డీఆర్‌ఓ ఉషారాణితో కలిసి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 27.12 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, డిసెంబర్‌లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే 3,073 పోలింగ్‌ స్టేషన్లను గుర్తించామన్నారు.

తాజాగా పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా మరో 150 కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు నాటికి ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వెసులుబాటు ఉన్నందున.. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు 
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఓటర్ల జాబితాపై రాజకీయపక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, ఈవీఎంల పనితీరుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించామని చెప్పారు. ప్రతి ఈవీఎంను నిశితంగా పరిశీలించి.. పనితీరును రూఢీ చేసుకున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా పర్యవేక్షణా బృందాలను నియమించినట్లు తెలిపారు.

ఇబ్రహీంపట్నంలో రూ.27 లక్షల నగదును పట్టుకున్నామని, ఈ నగదుపై ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందించామని చెప్పారు. ఎన్నికల ధన ప్రవాహం నియంత్రించేందుకు ప్రత్యేక సంచార బృందాలను కూడా రంగంలోకి దించామని తెలిపారు. కోడ్‌ ధిక్కరించినట్లు తేలినా ప్రచార వ్యయం అడ్డగోలుగా చేస్తున్నా తక్షణమే సంబంధిత అభ్యర్థులకు నోటీసులు జారీచేస్తామని చెప్పారు.
 
ఒకేచోట కౌంటింగ్‌ కేంద్రాలు 
జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపును ఒకే కేంద్రంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల విధులకు సుమారు 14వేల మంది సిబ్బంది అవసరమని గుర్తించగా, ఇప్పటివరకు 12వేల మందిని ఎంపిక చేశామని, వీరికి దశలవారీగా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అక్రమంగా 340 రోహింగ్యాల ఓట్లు మయాన్మార్‌కు చెందిన 340 మంది రోహింగ్యాలు అక్రమంగా ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు గుర్తించామని కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు.

కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు గుర్తించిన పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. ఇదిలావుండగా, జిల్లావ్యాప్తంగా 140 మంది శతాధిక ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. జాబితా ముసాయిదా ప్రచురించేనాటికి 896 మంది ఉండగా ఇందులో 47 మంది చనిపోయారని, 709 మంది వయస్సును సరిదిద్దడంతో కేవలం 140 మంది మాత్రమే శతాధిక వృద్ధులున్నట్లు తేలిందని వివరించారు.

కొత్తగా 48వేల దరఖాస్తులు 
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గత నెల 25వ తేదీతో ముగిసినా కొత్త ఓటర్ల నమోదుకు ఇంకా గడువు ఉన్నదని, ఇప్పటివరకు 48వేల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వాస్తవానికి నామినేషన్ల రోజు వరకు నమోదు వీలున్నప్పటికీ పాలనాపరమైన సౌలభ్యం దృష్ట్యా పది రోజుల ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఆయన సూచించారు. తద్వారా దరఖాస్తులను సులువుగా పరిష్కరించే వీలు కలుగుతుందని చెప్పారు.  

మరిన్ని వార్తలు