‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’పై ప్రత్యేక దృష్టి

10 Mar, 2020 08:45 IST|Sakshi

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆటోలన్నీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే  

మాదాపూర్‌ జోన్‌ పరిధిలో 963 ఆటోలపై కేసులు

సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మీ ఆటో రిజిస్ట్రేషన్‌ అయి ఉందా...ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో మీ ఆటోలు తిరుగుతున్నాయా...అయితే మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ ప్రాజెక్టు కింద మీ సంబంధిత వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సిందే...అలా కాకుండా ఏమైతుంది లే దొరికినప్పుడు చూద్దాం అనుకుంటే మాత్రం ఏకంగా కేసులు నమోదుచేసే వరకు పరిస్థితి వెళుతుంది. ఇందుకు ఉదహరణే ఇటీవల ఈ నెల రెండు నుంచి ఆరు వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 2,275  రిజిస్ట్రేషన్‌ లేని 963 ఆటోలపై కేసులు నమోదుచేశారు. భారీ మొత్తంలో జరిమానా కూడా విధించారు. ఎందుకంటే మహిళల భద్రత ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల భద్రత దృష్టిలో ఉంచుకొని గతేడాది ఆగస్టు 10 నుంచి ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ను సమర్థంగా అమలు చేస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకొని కాలపరిమితి ముగిసినా ఆటోలు కూడా మళ్లీ రెన్యూవల్‌ చేసుకోవాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు నమోదుచేసుకొని వారికూడా ముందుకొచ్చి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకొని మహిళలు, ఇతరుల భద్రతలో భాగస్వామ్యం కావాలన్నారు. లేదంటే ఇక నుంచి మరిన్ని ప్రత్యేక తనిఖీలతో ఆటోవాలాలపై పూర్తిస్థాయిలో కొరడా ఝుళిపిస్తామని చెప్పారు.  

కేంద్రాల్లో నమోదు తప్పనిసరి...
మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌ ఎదురుగా పోలీసు అవుట్‌పోస్టు, కూకట్‌పల్లి ఓల్డ్‌ ట్రాఫిక్‌ ఠాణా, రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఠాణా, అల్వాల్‌ ట్రాఫిక్‌ ఠాణాలకు ఆటోడ్రైవర్, యజమాని, అడ్రస్, రిజిస్ట్రేషన్‌ వివరాలు, డ్రైవింగ్‌ లైసెన్స్, గుర్తింపు కార్డులు మొదలగు వివరాలను ఆటోడ్రైవర్లువెంట తెచ్చుకోవాలి. అవి పోలీసులకు చెబితే పోలీసులు జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థలో నమోదుచేస్తారు. ఆ ఆటోకు క్యూఆర్‌ బార్‌కోడ్‌ బయట అతికిస్తారు. బార్‌కోడ్‌ను ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ యాప్‌ ద్వారా స్కాన్‌ చేస్తే  ఆటో వివరాలు తెలుస్తాయి. ఇతరులెవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే పోలీసులు వారిని వెంటనే కాపాడేందుకు వీలవుతుంది. అయితే నిబంధనల ప్రకారం పూర్వపు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడా రిజిస్ట్రేషన్‌ అయిన ఆటోలు (త్రీ వీలర్స్‌) సైబరాబాద్‌ పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకు మాదాపూర్‌ ట్రాఫిక్‌ డివిజన్‌లోని  మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్‌ ట్రాఫిక్‌ ఠాణాల పరిధిలో దాదాపు 9,360 ఆటోలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. ఇంకా కొంత మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా సైబరాబాద్‌లోని మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లో తిప్పుతున్నారు. ఈ ఆటోలపై కొరడా ఝుళిపిస్తున్నామని మాదాపూర్‌ డివిజన్‌ ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు