పాడులోకంలో బతకలేక..

8 Jul, 2016 01:29 IST|Sakshi
పాడులోకంలో బతకలేక..

తనువు చాలించిన అత్యాచార బాధితురాలు
ఎనిమిది నెలలుగా నరకయాతన
తల్లితో తరచూ ఆవేదన
చివరకు విగతజీవిగా మారిన వైనం
తల్లడిల్లిన తల్లి హృదయం బయ్యారంలో విషాదం

గజ్వేల్ : పేద కుటుంబానికి చెందిన పన్నెండేళ్ల వికలాం గురాలు.. కామాంధుడి చేతిలో ఎనిమిది నెలల క్రితం అత్యాచారానికి గురైంది. పసితనంలోనే చిన్నారిని చిదిమేయడంతో బతుకు ఆగమైంది. అప్పటినుంచి  మానసిక, ఆరోగ్య సమస్యలతో నరకయాతన అనుభవించింది. నిత్యం కన్నీటితో కాలం గడిపింది. ‘అమ్మా నాకీబతుకొద్దు’ అంటూ తరచూ తల్లితో ఆవేదన చెందింది. చిత్రవధను భరించలేక తల్లడిల్లిపోయింది. తుదకు బుధవారం రాత్రి ప్రాణాలు విడిచింది. కన్నపేగు మృతితో ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. ఓ దుర్మార్గుడి చేష్టలతో తన కూతురు భవిష్యత్తును బుగ్గిపాల్జేశాడంటూ గుండెలవిసేలా రోదించింది. ఈ విషాదకరమైన ఘటన గజ్వేల్ మండలం బయ్యారంలో చోటుచేసుకుంది.

బయ్యారం గ్రామానికి చెందిన గాలెంక నర్సమ్మ, నాగయ్య దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. తొమ్మిదేళ్ల క్రితమే పెద్ద కూతురు వివాహం జరిగింది. వివాహం, ఇంటి నిర్మాణం కోసం నాగయ్య దాదాపు రూ.3.5 లక్షల మేర అప్పులు చేశాడు. అప్పుల బెంగతో అనారోగ్యం బారినపడి మూడేళ్ల క్రితం మరణించాడు. రెండో కూతురు స్రవంతి (12) వికలాంగురాలు. కుమారుడికి ఏడేళ్లు ఉంటాయి. అసలే పేదరికం, అందునా తండ్రిని కోల్పోవడంతో కుటుంబ భారం తల్లిపై పడింది. నర్సమ్మ కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తుంది. పుట్టెడు అప్పుల్లో ఉన్న నర్సమ్మ అతికష్టమ్మీద కాలం గడుపుతోంది. వైకల్యం కారణంగా స్రవంతి ఇంటి వద్దే ఉంటుంది.

 ఎనిమిది నెలల క్రితం...
కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబంలో ఎనిమిది నెలల క్రితం ఓ విషాదం చోటుచేసుకుంది. వికలాంగురాలైన స్రవంతిని ఓ కామాంధుడు తాగిన మైకంలో ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కూలీ పనుల నుంచి వచ్చిన తల్లి ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఇతర ఆసుపత్రుల చుట్టూ తిరిగినా మామూలు మనిషి కాలేక పోయింది. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో అప్పట్లో ఎస్పీగా ఉన్న సుమతి ఆ గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

 అత్యాచారం తర్వాత షాక్‌లోకి...
ఎనిమిది నెలల క్రితం అత్యాచారం జరగ్గా ఆ బాలిక అప్పటి నుంచి మానసిక, ఆరోగ్యపర సమస్యలతో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ వచ్చింది. ఈ క్రమంలో బయటకు రావడానికి కూడా ఇష్టపడలేదు. తీవ్రంగా కుంగిపోయి తీవ్ర అనారోగ్యం పాలైంది. ‘నేను ఈ బతుకు బతకలేనని’ తరచూ తల్లితో తన ఆవేదనను వెల్లగక్కేది. అప్పటికే ఫిట్స్‌తో బాధపడుతున్న ఆ బాలికకు తరచూ విష జ్వరాలు రావటంతో చిక్కి శల్యమైం ది. కూతుర్ని ఎలా బతికించుకోవాలో తెలియక మదనపడింది. అత్యాచార బాధిత సాయం కింద ఇటీవల ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు రావడంతో అందు లో నుంచి వైద్యం కోసం రూ.50వేలు ఖర్చు చేసింది. కూతుర్ని చూసుకోవడానికి కూలీ పనులు మానేసింది. ఫించన్ డబ్బుతో పూటగడుపుకుంటున్నది. అయినా ఆ చిన్నారి ఆరోగ్యం మెరుగుపడలేదు. మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన స్రవంతి బుధవారం రాత్రి కన్నుమూసింది. గురువారం గ్రామానికి వెళ్లిన ‘సాక్షి’కి ఈ విషయం చెబుతూ నర్సమ్మ కన్నీరుమున్నీరైంది.

 నా బిడ్డను కడుపుల పెట్టి చూసుకున్న..
‘నా బిడ్డకు కాళ్లు సరిగ లేకపోయినా... కడుపుల పెట్టి చూసుకుంటున్న... అది నా ఎంబడి ఉంటే అదే సంతోషమనుకున్న... కామంతో కండ్లు మూసుకపోయిన దుర్మార్గుడు నా బిడ్డ బతుకు ఆగం జేసిండు. అప్పటి నుంచి నా బిడ్డ... మనిషిలా లేదు. ఎప్పుడు రందీతో ఉండేటిది. నాకు ఈ బతుకు ఇష్టం లేదు... సచ్చిపోతా... అని జెప్పేది... గిప్పుడు నాకు కడుపు కోత మిగిల్చిపోయింది....అంటూ బాలిక తల్లి నర్సమ్మ విలపించింది. కూతురి అంత్యక్రియలు సైతం చేయలేని స్థితిలో ఉన్న ఆ తల్లిని గ్రామానికి చెందిన నాయకుడు నర్సింలు ఓదార్చి అంత్యక్రియలు పూర్తి చేయించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

>
మరిన్ని వార్తలు