వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు

10 Dec, 2018 01:35 IST|Sakshi

గతేడాదితో పోలిస్తే 2.54 మీటర్ల దిగువకు మట్టాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగింటి పోతున్నాయి. లోటు వర్షపాతం కారణంగా చాలా జిల్లాల్లో ఖరీఫ్‌ పంటల సాగుకు రైతులు బోర్లపై ఆధారపడటంతో మట్టాల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది నవంబర్‌ మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 2.54 మీటర్ల దిగువకు పడిపోయాయి. మెదక్‌ జిల్లాలో ఏకంగా 20.71 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది 19 శాతం మేర లోటు వర్షపాతం తక్కువగా నమోదైంది.

ఈ ఏడాది నవంబర్‌లో భూగర్భ జల శాఖ 584 మండలాల పరిధిలో భూగర్భ మట్టాలను పరిశీలించింది. గతేడాది నవంబర్‌లో రాష్ట్ర సగటు నీటి మట్టం 8.36 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 10.90గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 2.54 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. కేవలం 8 జిల్లాల్లో మాత్రమే 0.34 మీటర్ల నుంచి 1.64 మీటర్ల పెరుగుదల కనిపించగా, 23 జిల్లాల్లో 7.85 మీటర్ల నుంచి 0.15 మీటర్ల వరకు తగ్గాయి. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, గద్వాల, మెదక్, వికారాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లోమట్టాలు ఊహించని రీతిలో పడిపోయాయి. ఏకంగా కొన్ని జిల్లాలో 7 మీటర్లు పడిపోగా, మరికొన్ని జిల్లాలో 6 మీటర్లకు పైగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేసవికి మరో 4 నెలల ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఇక నిండు వేసవిలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న గుబులు కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు