లేట్ అయినా.. లేటెస్ట్

13 Sep, 2015 04:43 IST|Sakshi
లేట్ అయినా.. లేటెస్ట్

- నూతన పద్ధతులతో పనులు చేస్తున్నాం
- ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- ఎంపీ కల్వకుంట్ల కవిత
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మోర్తాడ్:
తాము అధికారంలోకి రావడం కొంచెం లేటయినా లేటెస్ట్‌గా పనులు చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండలంలోని పాలెం, తొర్తి, దోన్‌పాల్ గ్రామాలలో శనివారం ఆమె తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఉద్యమించిన తాము అధికారంలోకి రాగానే నూతన విధానంలో పనులు చేస్తున్నామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అధునాతన పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు.

ఎక్కడా లోపం లేకుండా అభిృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ తారురోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఎనుగందుల అమిత, సర్పంచ్‌లు మాదం వెంకవ్వ, తొగటి అనిత, లింగన్న, ఉప సర్పంచ్‌లు మాదం నర్సయ్య, రవి, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మి, ఎనుగందుల అశోక్, డాక్టర్ జయవీర్, టీఆర్‌ఎస్ నాయకులు రాజాపూర్ణనందం, ఏలియా, గంధం మహిపాల్, పర్సదేవన్న పాల్గొన్నారు.
 
బాల్కొండలో..
ప్రజాసంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ కవిత అన్నారు. మండలంలోని మెండోరా నుంచి ముప్కాల్ వరకు 2.74 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు శనివారం  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ప్రజలు మోసపోయారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు రూ. 8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 23 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుక్షణం ప్రజా సంక్షేమం కోసమే కష్టపడుతున్నారని పేర్కొన్నారు.
 
రైతు సంక్షేమానికి పెద్దపీట..
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని కవిత చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు రైతు సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అన్నదాతలు మనోస్థైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులందరికీ సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ పథకాలు అందిస్తుందని, కేవలం అంకాపూర్ రైతులకే ఇస్తామనే భ్రమ వద్దని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ అర్గుల్‌రాధ, వైస్ ఎంపీపీ శేఖర్, ఎంపీడీఓ కిషన్, పీఆర్ ఏఈ ప్రభాకర్ గుప్త, సర్పంచ్ అరుణనవీన్, ఎంపీటీసీ రాజేశ్వర్, టీఆర్‌ఎస్ నాయకులు సామ వెంకట్‌రెడ్డి, భూమేశ్వర్, కొట్టాల రాజేశ్వర్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు