గజ్వేల్‌కు అరుదైన ఖ్యాతి

3 Jun, 2014 00:06 IST|Sakshi
గజ్వేల్‌కు అరుదైన ఖ్యాతి

- తెలంగాణకు తొలి సీఎంను అందించిన ఘనత  
- పునర్నిర్మాణానికి ఇక కేంద్ర బిందువు

గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ ప్రాంతం అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది. కేసీఆర్ ‘పునర్నిర్మాణం’ లక్ష్యానికి కేంద్రబిందువుగా మారబోతోంది. గజ్వేల్ రాజకీయ చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15సార్లు జరిగిన ఎన్నికల్లో 1989, 2004 ప్రాంతంలో డాక్టర్ జె.గీతారెడ్డి మంత్రి పదవులను దక్కించుకున్నారు. 1952లో పెండెం వాసుదేవ్, 1957లో జేబీ ముత్యాలరావు, ఆర్. నర్సింహారెడ్డి(ద్విసభ్య నియోజకవర్గం), 1958 ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఆర్. నర్సింహారెడ్డి, 1962, 1967, 1972, 1978లలో నాలుగు పర్యాయాలు గెలుపొందిన గజ్వేల్ సైదయ్య, 1983లో అల్లం సాయిలు, 1985లో సంజీవరావు, 1994లో డాక్టర్ విజయరామారావు, 1999లో సంజీవరావు, 2009లో తూంకుంట నర్సారెడ్డి ఎమ్మెల్యేలుగా పనిచేయగా.. తాజాగా 2014 ఎన్నికల్లో గెలుపొందిన కేసీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం విశేషంగా చెప్పొచ్చు.

ఇప్పటివరకు రాష్ట్రంలో సాదాసీదా నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో అగ్రతాంబూలాన్ని అందుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త తరహా ఆలోచనలకు నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులోని ఫామ్‌హౌస్ కేంద్రబిందువుగా మారటం.. ఈ దశలోనే టీఆర్‌ఎస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయికి చేరుకుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

పునర్నిర్మాణానికి వేదిక
‘కొత్త రాష్ట్రం-కొత్త నాయకత్వం-సరికొత్త పంథా’ పేరిట తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో.. ఆయన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ సహజంగానే ఈ లక్ష్యానికి కేంద్ర బిందువుగా మారబోతోంది. ప్రధానంగా వ్యవసాయరంగాభివృద్ధి ద్వారా కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయాలనుకుంటుండగా.. ముందు ఈ నియోజకవర్గం నుంచే కొత్త తరహా పథకాలకు అంకురార్పణ జరుగనుంది.

ఇకపోతే దశాబ్దకాలంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న గజ్వేల్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శాఖలవారీగా కేసీఆర్ నివేదికలకు ఆదేశించారు. ఈ నెల 4న స్థానిక ప్రజ్ఞా గార్డెన్స్‌లో ఈ వ్యవహారంపై సమగ్రంగా సమీక్ష జరిగి.. ఆ తదనంతరం నిధులు కూడా వరదలా వచ్చే అవకాశముంది. మొత్తానికి కేసీఆర్ గెలుపుతో గజ్వేల్‌కు కొత్త కళ రానుండటం నియోజకవర్గ ప్రజలను హర్షాతిరేకంలో ముంచెత్తుతోంది.

మరిన్ని వార్తలు