కేర్‌లో అరుదైన గుండె చికిత్స 

20 Mar, 2019 02:39 IST|Sakshi

నైజీరియాకు చెందిన 13 ఏళ్ల అమ్మాయికి కొత్త జీవితం 

గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న అగత 

రెండు లక్షల మందిలో ఒకరికి ఈ రుగ్మత 

సాక్షి, హైదరాబాద్‌: నైజీరియాకు చెందిన 13 ఏళ్ల అగతకు అరుదైన శస్త్రచికిత్స చేసి బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారు. ఆ పాప పుట్టుకతోనే అరుదైన గుండె సంబంధ సమస్యలతో బాధపడుతుండేదని, వాటిని సరిదిద్దామని కేర్‌ ఆస్పత్రి పీడియాట్రిక్‌ కార్డియాలజీ విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. గుండె కుడివైపు ఉన్న గదులకు (కుడి కర్ణిక, కుడి జఠరిక) మధ్య ఉన్న కవాటం (ట్రైకస్పిడ్‌ వాల్వ్‌) ఆమెకు పుట్టినప్పటి నుంచి సరిగా పనిచేయట్లేదని, ఇలా ఉండటాన్ని ‘ఎబెస్టిన్స్‌ అనోమలీ’అంటారని పేర్కొన్నారు. సాధారణంగా ఉండాల్సిన స్థానం కన్నా ఈ కవాటం కిందకు ఉందని, ఆ కవాటం కూడా చాలా అసాధారణ స్థితిలో ఉందని చెప్పారు.

ఈ సమస్య ప్రతి 2 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందని తెలిపారు. దీంతో కుడి కర్ణిక ఎక్కువ విశాలంగా ఉండి అందులోకి ఎక్కువ రక్తం చేరేదని వివరించారు. ఈ కారణంగా కుడి, ఎడమ కర్ణికల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఏర్పడి ఈ రెండింటి మధ్య చెడు, మంచి రక్తం మార్పిడి జరుగుతుండేదని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా గుండె పనితీరు సరిగా ఉండదని, ఒక్కోసారి గుండె వైఫల్యం చెందే ప్రమాదం ఉందని చెప్పారు. కేర్‌ హాస్పిటల్‌ పీడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ జీనా మఖీజా నేతృత్వంలో శస్త్రచికిత్స జరిపి ఆమె కవాటాన్ని సరిచేశారు. రెండు కర్ణికల మధ్య గోడకు ఉన్న రంధ్రాన్ని మూసేశారు. శస్త్రచికిత్స జరిగిన రెండో రోజే ఆమెను డిశ్చార్జి చేశారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత 11 రోజుల వ్యవధిలోనే ఆమె పూర్తిగా కోలుకునేలా చేయగలిగామని డాక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు