అరుదైన ఖురాన్‌.. ఏడాదిలో ఒకసారి బయటికి..

11 Nov, 2019 10:27 IST|Sakshi
 గట్టులోని అతి చిన్న పవిత్ర ఖురాన్‌ గ్రంథం; ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

జామీయా మసీదులో అతి చిన్న ఖురాన్‌

సాక్షి, గట్టు (గద్వాల): సుమారు 238 ఏళ్ల నాటివిగా భావిస్తున్న అరుదైన.. అగ్గి పెట్టేకన్నా చిన్న సైజులోని పవిత్ర ఖురాన్‌ గ్రంథాలను మిలాదున్‌ నబీ సందర్భంగా బయటకు తీశారు. గట్టులోని జామీయా మసీదు, బిచ్చాలపేటలోని మసీదులో ఈ గ్రంథాలు ఉండగా.. ఏడాదిలో ఒకేఒక్క సారి మాత్రమే బయటకు తీస్తారు. మొత్తం 480 పేజీలు... 30 పారే (పర్వాలు)లు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇందులోని అక్షరాలను భూతద్దం ద్వారా చూస్తేనే కంటికి కన్పిస్తాయి. ఇక్కడి ముస్లింలు తరతరాలుగా ఈ గ్రంథాలను పవిత్రంగా బావిస్తూ, భద్రపరుస్తూ వస్తున్నారు. ఖురాన్‌ను మంత్రోచ్ఛరణల మధ్య మత పెద్దలు బయటకు తీస్తారు. కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే సందర్శనార్థం ఉంచి మళ్లీ లోపల భద్రపరుస్తారు. ఈ గ్రంథాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయనేది ఇక్కడి వారి నమ్మకం.

మొగల్‌ కాలం నుంచి..
మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో గట్టులో జామీయా మసీదును నిర్మించినట్లుగా స్థానిక ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. తరతరాలుగా ఈ అతి చిన్న పరిమాణం (ఇంచున్నర) ఉన్న ఖురాన్‌ గ్రంథాన్ని ఎంతో భక్తితో, జాగ్రత్తగా మసీదులో భద్రపరుస్తున్నారు. మక్కా, మదీనా నుంచి ఈ గ్రంథంతో పాటు ఆసర్‌ ముబారక్‌ (మహమ్మద్‌ ప్రవక్త వెంట్రుక) తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రతీ ఏడాది వీటిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాలకు  చెందిన ముస్లీంలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

మరిన్ని వార్తలు