అందుబాటులో...అరుదైన రికార్డులు..

17 Aug, 2014 03:37 IST|Sakshi
అందుబాటులో...అరుదైన రికార్డులు..
  •       కాకతీయ యూనివర్సిటీలో రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయం
  •      1930 నుంచి 1975 వరకు రెవెన్యూ రికార్డులు భద్రం
  •      ‘ఈస్ట్ ఇండియా’ పుస్తకాలు మొదలు ‘హైదరాబాద్ రాష్ర్ట చరిత్ర’ వరకు లభ్యం
  • కేయూ క్యాంపస్ : మొగల్ చక్రవర్తుల చరిత్ర, ఏపీ గెజిట్‌కు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, వివిధ జిల్లాల కైఫియత్తులు, మీర్ నిజాం అలీఖాన్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన పుస్తకాలు... వీటి పేర్లు వింటుంటే చదవాలనే ఆసక్తి కలిగినా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయిలే అనే నిరాశ కూడా అలుముకుంటుంది. అయితే, మన జిల్లా వాసులకు ఆ నిరాశ అవసరం లేదు. ఏమంటే కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయం ఆ వెసులుబాటును కల్పిస్తోంది.

    వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సుమారు 75 ఏళ్లకు పైగా రెవెన్యూ రికార్డులు, చరిత్ర పుస్తకాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఔత్సాహికులు ఎలాంటి ఖర్చు లేకుండా వాటిని చదువుకునే అవకాశం ఉండగా, ఏమైనా ప్రతులు కావాలంటే స్వల్ఫ ఫీజు చెల్లించి జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. చరిత్రకు సంబంధించి అద్భుతమైన పుస్తకాలు, రికార్డులు ఉన్న ఈ నిలయం విశేషాలపై ప్రత్యేక కథనం.
     హైదరాబాద్‌లో స్టేట్ ఆర్క్యూస్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిస్ట్యూట్ ఉంది.

    పరిశోధకులకు ఉపయోగపడే ఎన్నో లక్షల పుస్తకాలు, వేల రికార్డులు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్క్యూస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తర్వాత విశాఖపట్నం, గుంటూరు, రాజమం డ్రి, తిరుపతి, అనంతపురంలో అనుబంధంగా రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయాలు ఏర్పాటుచేశారు. అలాగే, మన ప్రాంతంలో కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు 1992లో కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో ప్రాంతీయ నిల యం ఏర్పాటుచేశారు. దీంట్లో వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన అనేక పాత రికార్డులను తెప్పించి భద్రపరిచారు.
     
    ఏమేం ఉన్నాయి...

    కాకతీయ యూనివర్సిటీ ఆవరణలోని రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయంలో విధ చరిత్ర పుస్తకాలతో పాటు గత 75 ఏళ్లకు సంబంధించిన రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లు  భద్రపరిచారు. మొగలు చక్రవర్తుల చరిత్ర మొదలుకుని ఎందరో రాజుల, రాజ్యాల చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. చరిత్ర పరిశోధకులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పాలి. ఇంకా 1930 నుంచి 1975 సంవత్సరం వరకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని రెవెన్యూ, ఇనాం, ఆలయాల భూముల రికార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏపీ గెజిట్‌కు సంబంధించిన పలు రికార్డులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన 50ఏళ్ల ఫైళ్లు ఉంచారు.

    అంతేకాకుండా ద్రాక్షారామం శాసనాలు, ది ఫ్రీడమ్ స్టేట్ ఇన్ హైదరాబాద్-ఆంధ్రప్రదేశ్, హిస్టరీ ఆఫ్ ది ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పర్మాన్స్ అండ్ సానాదస్, డక్కన్ సుల్తాన్స్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం కైఫీయుత్తులు, ఆంధ్రోద్యమ చరిత్ర, పీవీ.రంగారావు రచించిన ప్రసగ చంద్రిక, 1780-1798కు సంబంధించిన మీర్ నిజాం అలీఖాన్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పుస్తకాలు అందులో ఉన్నాయి. ఇతిహాస్ జర్నల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్య్కూస్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ల పుస్తకాలను ఇక్కడ భద్రపరిచారు.
     
    కేయూ రికార్డులు సైతం..1992లో ఏర్పాటు

    కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తొ లుత(పీజీ సెంటర్ పేర ఏర్పాటుకోసం) అప్ప ట్లో 1967నుంచే భూసేకరణ యత్నాలు చేశా రు. ఈ ప్రయత్నాలకు సంబంధించి సర్వే నం బర్లతో కూడిన పాత రికార్డులు కూడా రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయంలో ఉన్నాయి. వా టి మ్యాప్‌లను కూడా భద్రపరిచారు.
     
    రికార్డులు పాడు కాకుండా..

    కేయూలోని రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయానికి తీసుకొచ్చే రికార్డులు, పుస్తకాలు చెదలు పట్టకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీని కోసం బీరువా మాదిరిగా ఫెమినేషర్ చాంబర్ ఉంటుంది. దీని అడుగు భాగంలో ఓ కెమికల్ కప్ ఉంచుతారు. ఆ తర్వాత ఆ బీరువాలో పుస్తకాలను రెండు వారాల పాటు భద్రపరుస్తారు. ఈ మేరకు కెమికల్ ప్రభా వం పుస్తకాలపై పడి వాటికి చెదలు పట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత పుస్తకాలు, రికార్డులను తీసి భద్రపరుస్తారు.
     
    అసౌకర్యాల నడుమ..

    కాకతీయ యూనివర్సిటీలోని రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. క్యాంపస్‌లోని ఎన్‌ఎస్‌ఎస్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఈ కేంద్రానికి వెళ్లేందుకు సరైన దారి కూడా లేదు. అంతేకాకుండా ఈ నిలయానికి సంబంధించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో... అరుదై న రికార్డులు పరిశీలించే  అవకాశం ఉందని ఇ ప్పటికీ చాలా మంది పరిశోధకులకు తెలియదు. ఈ నిలయం ఇప్పటికే పుస్తకాలు, రికార్డులు, ఫైళ్లతో నిండిపోగా, వరంగల్, ఖమ్మం జి ల్లాల నుంచి ఇంకా పాత రికార్డులు తీసుకురావడం లేదు.

    ఈ విషయమై అనువైన భవనం కేటాయించాలని స్టేట్ ఆర్య్కూస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధికారులు.. కేయూ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఈ నిలయానికి కనీసం అటెండర్ లేకపో గా.. ఉన్న ఒకే అధికారి కార్యాలయం తలుపులు తెరవడం మొదలు అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఇటు కేయూ అధికారులు.. అటు జిల్లా ధికారులు స్పందించి రా జ్యాభిలేఖ ప్రాంతీయ నిలయానికి మంచి భవ నం కేటాయించడంతో పాటు పరిశోధకులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరముంది.
     
    సమాచారం సర్టిఫైడ్ కాపీలు ఇస్తాం
     
    ఇనాం, దేవాలయాలు, లావణీ పట్టా భూములే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల భూములకు సంబంధించి పాత రికార్డులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటి సమాచారం కావాలంటే స్వల్ఫ ఫీజు తీసుకుని సర్టిఫైడ్ కాపీలు ఇస్తాం. ఇంకా హిస్టరీ పరిశోధకులకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు నిలయంలో ఉన్నాయి. యూనివర్సిటీ అధికారులు మంచి భవనం కేటాయిస్తే రాజ్యాభిలేఖ నిలయం ఏర్పాటుచేసిన ఉద్దేశం నెరవేరుతుంది. ప్రస్తుతం స్థలాభావం కారణంగా ఇంకా చాలా పాత రికార్డులను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తీసుకోలేకపోతున్నాం.
     మహ్మద్ తెహర్ అలీ, ఆర్చివిస్టు
     

మరిన్ని వార్తలు