చిత్రం.. భళారే విచిత్రం!

5 Aug, 2018 02:15 IST|Sakshi

మేడ్చల్‌ జిల్లా ఏదులాబాద్‌లో  అరుదైన శిలాచిత్రం

ఒకే చిత్రం ఒకే బండపై 60 సార్లు..

బండపై ఎక్కడా ఖాళీ లేకుండా చిత్రాలు

పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి ద్వారా వెలుగులోకి...

సాక్షి, హైదరాబాద్‌: ప్రాచీన మానవులు వారి చిత్రాలు, కళలతో నేటికీ మనతో సంభాషిస్తున్నారు. వారి సంస్కృతి, జీవన విధానాన్ని చిత్రాలుగా మలచి తమ గురించి తెలుసుకోమంటున్నారు. నాటి మానవుల సృజనాత్మకతకు అద్దం పట్టే అనేక శిలా చిత్రాలు మనం చాలానే చూశాం.

కానీ ఒకే చిత్రాన్ని 60 సార్లకుపైగా ఓ బండపై గీయడం (పెట్రోగ్లిఫ్స్‌), అది కూడా బండపై ఎక్కడా ఖాళీ లేకుండా వేయడం చూశామా..! అలాంటి అరుదైన రాతి కళాఖండం తెలంగాణలో ఏదులాబాద్‌ గ్రామంలో వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా వీరన్నపేట గ్రామంలో అతిపెద్ద శిలా చిత్రాల స్థావరాన్ని కనుగొన్న చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డే దీన్ని కనుగొన్నారు.  

ఏమిటీ చిత్రం..
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఏదులాబాద్‌ గ్రామం ఉంది. ఆ గ్రామ పరిధిలో ఊర గుట్ట, వడిసెల గుట్ట, పాండవుల గుట్ట, పరశురాముల గుట్ట, ఓబులేశుని గుట్ట, కొలను గుట్ట, కుందేళ్ల గుట్ట, చింతగుట్ట, దశగుట్ట, కోటగుట్ట, గరుడాద్రి గుట్ట, భైరవ గుట్ట ఉన్నాయి. ఇక్కడి భైరవగుట్టపై 9 తలల కాలభైరవుడు, ఆంజనేయుడి విగ్రహాలు, శాసనాలున్నట్లు గతంలో చరిత్ర కారులు కనుగొన్నారు.ఈ గుట్టలోనే దేశంలో అరుదైన శిలా చిత్రాలున్న బండ ఉంది. సుమారు 1.5 మీటర్ల ఎత్తు, 4.5 మీటర్ల చుట్టుకొలత ఉన్న ఈ బండపై ఒకే చిత్రాన్ని సుమారు 60 సార్లు వేశారు. ఇంగ్లిష్‌లో బ్లాక్‌ అవుట్‌ సన్‌రైజ్‌  పద్ధతి ఉంది. ఇందులో రెండు గీతల మధ్య ఖాళీ వదులుతూ అక్షరాలు రాస్తారు. ఆ పద్ధతిలో ఇంగ్లిష్‌ ఐ అక్షరాన్ని పోలిన చిత్రాలనే బండపై గీశారు.


బండ బండకూ చరిత్రే
ముచుకుంద (మూసీ) నదీ తీరాన ఏదులు గుంపులుగా సంచరించిన ప్రాంతాన్నే ఏదులాబాద్‌గా పిలుస్తున్నారు. గ్రామపరిధిలో 12 వరకు గుట్టలు, పరుపు బండలు, ఐదారు శాసనాలు, భైరవ, హనుమాది శిల్పాలు, దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి బండకూ ఓ చరిత్ర ఉంది. భైరవగుట్ట దిగువన ఉన్న బండపైనే ఒకే చిత్రాన్ని 60 సార్లు వేశారు. ఈ గ్రామంలోని తిరుమలేశుని బండపై నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు నూరుకోగా ఏర్పడిన గుర్తులున్నాయి.వీటిని ఇంగ్లిష్‌లో గ్రూప్స్‌ అంటారు. గ్రామీణ క్రీడ సిర్రగోనె ఆటలో త్రవ్వే పొడవైన బద్దులను ఇవి పోలి ఉంటాయి. భైరవగుట్ట, ఊరగుట్టల సమీపంలో బృహత్‌ శిలాయుగపు సంస్కృతి ఉంది. రాకాసి గుళ్లుగా పిలిచే సమాధులు ఇక్కడ సాగులో భాగంగా తొలగించారు. వీటి ఆధారంగా ఈ శిలా చిత్రాలు ఆది మానవులు గీసినవేనని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

9 తలల భైరవుడు
ఏదులాబాద్‌ భైరవ గుట్టకు చెక్కిన భైరవునికి 9 తలలు, 16 చేతులున్నాయి. పౌరాణికాల్లో భైరవునికి ఇన్ని తలలున్నట్లు చెప్పలేదు. సదాశివునికి 5 తలలే ఉంటాయి. బౌద్ధంలో, అందులో తాంత్రిక బౌద్ధంలో వజ్ర భైరవునికి 9 తలలు, 16 చేతులుంటాయి. 9 తలలున్న మరో భైరవుని పేరు యమాంతకుడు.

ఈ భైరవుల చిత్రాలు నేపాల్‌ దేశంలోనే కనిపిస్తాయి. మనదేశంలో 9 తలల హిందూ భైరవుడు ఏదులాబాద్‌లోనే ఉన్నాడు. భైరవతంత్రం, అష్టవిధ భైరవులలో లేని ఈ అరుదైన భైరవుణ్ని ఏదులాబాద్‌లో ఎవరు చెక్కారో, ఎందుకు చెక్కారో తెలియాల్సి ఉంది.
– రామోజు హరగోపాల్, తెలంగాణ చరిత్ర బృందం

పరిశోధనలు జరపాలి
ఏదులాబాద్‌ గుట్టల్లో 2 శాసనాలు, 9 తలల కాలభైరవ శిల్పం, పెట్రోగ్లిఫ్స్‌ (రాతిని తొలిచి చెక్కిన బొమ్మలు) ఉన్నందున క్వారీ పనులు ఆపాలి. పురావస్తు శాఖ సమగ్ర పరిశోధన జరిపి ఇక్కడ చరిత్రను ప్రజలకు తెలపాలి. ఇక్కడి శాసనాలు, వాటి వివరాలు తెలిపే బోర్డును గుట్టపై ప్రదర్శించాలి. 
- రత్నాకర్‌రెడ్డి, పరిశోధకుడు  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేటి ముఖ్యాంశాలు..

ఇదీ కరోనా సేఫ్టీ టన్నెల్‌

సమర శంఖం!

ఆ రెండూ దొరకట్లేదు..

గబ్బిలాలతో వైరస్‌.. నిజమేనా?

సినిమా

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు