పసికందుకు పునర్జన్మ

6 Mar, 2020 08:08 IST|Sakshi
పసికందుతో తల్లిదండ్రులు, వైద్యబృందం, ఆస్పత్రి యాజమాన్యం

21 రోజుల శిశువుకు గుండె ఆపరేషన్‌

హృదయ రంధ్రానికి కోనార్‌ డివైజ్‌ ఏర్పాటు

ప్రపంచంలోనే మొదటి శస్త్రచికిత్స: వైద్యులు

చైతన్యపురి: ఆ పసికందు బరువు 2.5 కేజీలు. పుట్టుకతోనే శ్వాసకోశ, గుండె సంబంధిత ఇబ్బందులు. గుండెలో రంధ్రం ఉండటంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆపరేషన్‌ చేసేందుకు సహకరించని వయసు, పసికందు బరువు. దీంతో పారమిత ఆస్పత్రి యాజమాన్యం, వైద్యబృందం, హీల్‌ ఎ  చైల్డ్‌ స్వచ్ఛంద సంస్థ చొరవతో ప్రత్యేక చికిత్స చేశారు. గుండె రంధ్రాన్ని ప్రత్యేక పరికరంతో కోనార్‌ డివైజ్‌ అమర్చి విజయవంతంగా ఆపరేషన్‌ చేశారు. గురువారం చైతన్యపురిలోని పారమిత ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో వైద్యం బృందం మాట్లాడుతూ..తక్కువ వయసుఉన్న  పసికందు (21 రోజులు)కు ఇటువంటి ఆపరేషన్‌ చేయటం ప్రపంచంలోనే మొదటిసారి అని తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ సతీష్, శోభ దంపతులకు జన్మించిన కుమారుడు పుట్టుకతోనే నిమోనియాతో శ్వాస సంబంధిత ఇబ్బందులు రావటంతో నగరంలోని పారమిత చిల్డ్రన్స్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు బాబుకు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. వెంటిలేటర్‌ ఏర్పాటు చేసి చికిత్స మొదలుపెట్టారు. శిశువుకు పరీక్షలు చేసిన చిన్నపిల్లల నిపుణులు డాక్టర్‌ శ్రీనివాస్‌ ముర్కి, డాక్టర్‌ శ్రీరాంలు ఆపరేష్‌ తప్పనిసరి అని నిర్ధారించారు.

పారమిత ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ ధనరాజ్, మెడికల్‌ డైరెక్టర్‌ సతీష్‌లు కేసును చాలెంజ్‌గా తీసుకుని   రెయిన్‌బో కార్డియాక్‌ సెంటర్‌కు చెందిన పిడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ను సంప్రదించారు. ఆపరేషన్‌ చేసేందుకు ముందుకు వచ్చారు. కోనార్‌ డివైజ్‌ బటన్‌ను అమర్చి గుండెకు ఉన్న రంధ్రాన్ని మూసేందుకు సమ్మతించా రు. అనారోగ్య పిల్లలకు ఆర్థిక సహాయం చేసే స్వచ్ఛంద సంస్థ, పారమిత ఆస్పత్రి వర్గాల ఆర్థిక  సహకారంతో డాక్టర్‌ నాగేశ్వర్, శ్వేత బృందం 21 రోజుల పసికందుకు విజయవంతంగా ఆపరేషన్‌ పూర్తి చేశారు. ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత శిశువు పూర్తిగా కోలుకుందని,   సొంతంగా ఊపిరి తీసుకుంటోందని, గుండెపనితీరు కూడా బాగుందని వైద్యులు తెలిపారు. ప్రపంచంలోనే 21 రోజుల పసికందుకు గుండె ఆపరేషన్‌ చేయటం మొదటిసారి అని పేర్కొన్నారు. తమ బాబుకు గుండె రంధ్రానికి ఆపరేషన్‌ చేసి పునర్జన్మ ప్రసాదించారని తల్లిదండ్రులు సతీష్, శోభలు తెలిపారు. పారమిత ఆస్పత్రి వైద్యులు, యాజమాన్యం,  హీల్‌ ఏ చైల్డ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్‌ ప్రమోద్, ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు నాగేశ్వరరావు, శ్వేతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు