ఈ మహావీరుడు సరిహద్దు బాధితుడు!

10 Apr, 2018 02:14 IST|Sakshi
ఆలయం ముందు గౌతమ బుద్ధుడు అని తెలుగులో రాసిన దృశ్యం, ఆలయంలో మహావీరుడి 10 అడుగుల విగ్రహం

తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో వెయ్యేళ్లనాటి అపురూప మందిరం

తెలుగు వారి ఊరు కావటంతో పట్టించుకోని కర్ణాటక

రక్షిత కట్టడంగా కూడా గుర్తించని వైనం

కన్నడ నేల కావటంతో తొంగి చూడని తెలంగాణ పురావస్తు శాఖ

జైన మందిరమైనా బుద్ధుడిగా ఆరాధిస్తున్న స్థానికులు

సాక్షి, హైదరాబాద్‌: చుట్టూ కొలువుదీరిన 24 మంది తీర్థంకరులు.. రెండువైపులా వింజామరలు పట్టుకుని ఉపచారాలు చేస్తున్న గంధర్వులు.. తలపైన త్రిఛత్ర ఛాయ.. దాని దిగువన ఎనిమిది తలల శేషుడు.. ఎత్తయిన పీఠం.. దానిపై ధ్యానముద్రలో మహావీరుడు! కళ్యాణ చాళుక్యుల హయాంలో 12వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న అద్భుత విగ్రహమిది. ఇది ఏ తవ్వకాల్లో దొరికిందో, మట్టిలో కూరు కుపోయి ఉందో కాదు. ఇప్పటికీ భక్తుల పూజలందుకుంటున్న ఈ విగ్రహం ఓ దేవాలయంలో కొలువుదీరి ఉంది. ఇది జైనుల ఆలయం. మహావీరుడి ఉత్సవ మూర్తిగా వెలుగొందుతున్న మందిరం. కానీ ఆలయ ముఖద్వారంపై ‘గౌతమ బుద్ధుడు’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. భక్తులు అది బుద్ధుడి విగ్రహంగానే భావించి జ్యోతి వెలిగిస్తూ పూజిస్తున్నారు. 

మరి మహావీరుడిని బుద్ధుడిగా ఎందుకు ఆరాధిస్తున్నట్టు...??
రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉండటమే ఆ దేవాలయానికి శాపమైంది. ఈ ఆలయ భూభాగం కర్ణాటక పరిధిలో ఉన్నా ఊరుఊరంతా తెలుగువారే. దీంతో కర్ణాటక పురావస్తు శాఖ దీన్ని గాలికొదిలేసింది. ఊరంతా తెలుగువారైనా.. భూభాగం సరిహద్దుకు కాస్త ఆవల ఉండటంతో ఇటు తెలంగాణ పురావస్తుశాఖ నిస్సహాయంగా ఉండిపోయింది. దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఈ మందిరంపై కనీస పరిశోధనలు కూడా జరగలేదు. చుట్టుపక్కల ఎలాంటి తవ్వకాలు, ఇతర శాసనాలు, విగ్రహాల అన్వేషణ చేయలేదు. ఫలితంగా... అది మహావీర దేవాలయం అని కూడా స్థానికులకు తెలియకుండా పోయింది. విగ్రహాకృతి ఆధారంగా బుద్ధుడిదిగా భావిస్తూ వస్తున్నారు. ముందుభాగాన్ని రంగులతో అలంకరించి పండుగలప్పుడు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అరుదైన, అపురూపమైన విగ్రహంగా చరిత్రకారులు భావిస్తున్నా ‘సరిహద్దు’ శాపంతో ఆ మందిరం మరుగునపడిపోయింది. కనీసం దాన్ని రక్షిత కట్టడంగా కూడా కర్ణాటక గుర్తించటం లేదు.

ఎక్కడుంది ఆ గ్రామం?
వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌ గ్రామా నికి రెండు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ –కర్ణాటక సరిహద్దు ఉంది. అక్కడ్నుంచి కొన్ని మీటర్ల దూరంలో కర్ణాటక భూభాగంలో ఉన్న గ్రామమే మిర్యాన్‌. ఇది కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి తహసీల్‌ పరిధిలోకి వస్తుంది. పేరుకు ఈ గ్రామం కర్ణాటక భూభాగంలో ఉన్నా.. గ్రామస్తులంతా తెలుగువారే. అక్కడి పోలీసుస్టేషన్‌ సమీపంలో ఉన్న ఈ దేవాలయంపై ‘గౌతమ బుద్ధుడు’ అని తాటికాయంత తెలుగు అక్షరాలు కనిపిస్తాయి. అందులో కొలువుదీరిందే ఈ మహావీరుడి మూర్తి. నిజాం సంస్థానం ఉన్నప్పుడు ఈ ప్రాంతమంతా నిజాం పాలనలో ఉండేది. అప్పట్లో తెలుగువారే ఉండటంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ వారే ఉంటున్నారు. జైన ఆరాధకులైన కళ్యాణ చాళుక్యులు ఎన్నో జైన మందిరాలు నిర్మించారు. అందులో ఇది ఒకటి. ఇప్పటికీ ఓవైపు మందిర అసలు నిర్మాణం తాలూకు రాళ్లవరస కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో దాన్ని ధ్వంసం చేయటంతో స్థానికులే చిన్నగా, సాధారణ రాళ్లతో తోచిన విధంగా పునర్నిర్మించిన దాఖలాలు కనిపిస్తున్నాయి.

‘‘ఇది వందల ఏళ్లనాటి గుడి. ఇక్కడి విగ్రహం అందంగా ఉంటుంది. చాళుక్యుల కాలంలో దీన్ని నిర్మించారని చెబుతారు. కానీ ఎప్పుడూ పురావస్తు శాఖ అధికారులు రాలేదు. కనీసం తెలంగాణ పురావస్తుశాఖ అయినా, లేదంటే కేంద్ర పురావస్తు శాఖ అయినా పట్టించుకోవాలి’’
– యాహమత్‌ ఖాన్, మిర్యాన్‌ గ్రామస్తుడు

‘‘యాభై ఏళ్ల క్రితం వరకు దేశవ్యాప్తంగా పర్యాటకులు వచ్చి ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడ ఉత్సవాలు చేసిన తీరును నా కళ్లారా చూశాను. ఆ తర్వాత జనం రావటం తగ్గింది. అసలు ఇక్కడ గుడి ఉందనే విషయం కూడా ఇప్పుడు మరిచిపోయారు. దీన్ని అభివృద్ధి చేస్తే మా ఊరు కూడా బాగుపడుతుంది’’
– ఖాజా బీ, స్థానికురాలు

మరిన్ని వార్తలు