‘తోటపెల్లి’ వరప్రదాయిని

4 Sep, 2019 09:16 IST|Sakshi
తోటపెల్లి రిజర్వాయర్‌లో జల హారతి ఇస్తున్న ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితెల సతీశ్‌బాబు

సాక్షి, బెజ్జంకి(సిద్దిపేట): మెట్టప్రాంత రైతులకు వరప్రదాయిని తోటపెల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌బాబుతో కలిసి మంగళవారం మండలంలోని తోటపెల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం తిమ్మాపూర్‌ చిగురుమామిడి, కోహెడ మండలాలకు నీళ్లు వదిలేందుకు స్విచ్‌ ఆన్‌చేసి షటర్‌ ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కృషితో మిడ్‌ మానేరు ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయని తెలిపారు. తోటపెల్లి రిజర్వాయర్‌ పనులు దాదాపుగా పూర్తయ్యాయని మిగితా పనులు త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్‌కు బెజ్జంకి మండలంలోని చెరువులను అనుసంధానం చేసి నీళ్లతో నింపుతామన్నారు. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతందని మరో మూడు నెలల్లో గౌరవెల్లి వరకు నీళ్లు వస్తాయని చెప్పారు.

కల సాకారమైంది: ఎమ్మెల్యే ఒడితెల
హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌బాబు మాట్లాడుతూ దశాబ్దలుగా వరద కాలువ ద్వారా నీళ్లు వస్తాయనే ఆశతో ఎదురు చేశామని, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కృషితో కల సాకారమయిందని పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్‌ నుంచి హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి, తిమ్మాపూర్‌ మండలాలకు నీళ్లు అందుతాయన్నారు. అనంతరం రిజర్వాయర్‌ పనులను, నీటి మట్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు మిడ్‌ మానేరు నుంచి 1.6735 టీఎంసీల నీల్లు వచ్చాయని అందులో నుంచి కాలువ ద్వారా 200 క్యూక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరి రాజిరెడ్డి, తన్నీరు శరత్‌రావు, ఈఈ రాములు, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, ఎంపీపీ లింగాల నిర్మల, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు