ర్యాష్‌ డ్రైవింగ్‌

31 Aug, 2018 14:54 IST|Sakshi
జగిత్యాలలో ద్విచక్ర వాహనంపై ట్రిపుల్‌ రైడింగ్‌  

ఆటోవాలాల ఇష్టారాజ్యం

బైకులతో యువకుల హల్‌చల్‌

ప్రయాణికుల భయాందోళన

పోలీసుల నిఘా కరువు

జగిత్యాలక్రైం :  రయ్‌..రయ్‌మంటూ కుర్రకారు జోష్‌.. ఆటోలను ఎలా నడిపిన తమను అడిగేవారు లేరనే ఆటోవాలాల ధీమ.. జగిత్యాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాత్రయితే చాలు రోడ్లపైకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. బైక్‌పై ముగ్గురేసి యువకులు ఎక్కి హైస్పీడ్‌లో వెళ్తూ సడన్‌గా బ్రేక్‌లు వేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మధ్యాహ్నం వేళ పోలీసుల నిఘా ఉంటున్నప్పటికీ రాత్రయితే వీరు జోష్‌ పెంచుతున్నారు. ఎక్కువ శబ్దాలు వచ్చే వాహనాలతో విపరీతమైన వేగంతో వెళ్తున్న వీరి సరదా ఎదుటి వారి ప్రాణాలమీదికి తెస్తుంది.   

రాత్రి వేళల్లో..  

అర్ధరాత్రి ఆటోలు ఎక్కే ప్రయాణికులకు ఆటోవాలాలు తమను గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తారన్న భరోసా లేకుండా పోతుంది. కొందరు ఆటోవాలాలు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకొని వేగంగా నడుపుతుండడంతో ప్రయాణికులు జంకుతున్నారు. మెల్లగా వెళ్లాలని చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోయారు. రాత్రి వేళల్లో పోలీసుల నిఘా కరువవడంతోనే వీరి ఆగడాలు శృతిమించుతున్నాయి. 

నిఘా ఎక్కడా ? 

రోడ్లపై కొందరు ఆటోవాలాలు, ద్విచక్రవాహనదారులు, కార్లు, జీపులు ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేస్తున్న ప్రధాన చౌరస్తాల వద్ద పోలీసులు, పెట్రోలింగ్‌ పోలీసులు వీరిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే వారిలో మార్పు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. జిల్లాకేంద్రంలో న్యూసెన్స్‌కు పాల్పడేవారిపై ‘ఈ పెట్టి’ కేసులు ఎలా నమోదు చేస్తున్నారో వీరిపై అలాంటి కేసులు పెట్టాలని పలువరు అభిప్రాయపడుతున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌పై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.

 భద్రత కల్పించాలి 

ఆటోలో ప్రయాణించే వారికి భద్రత కల్పించాలి. ముఖ్యంగా ఒంటరిగా ఆటోలో వెళ్తే క్షేమంగా ఇంటికి చేరుతామన్న నమ్మకం కోల్పోతున్నారు. కొందరు ఆటోడ్రైవర్లు రాత్రివేళల్లో ప్రయాణికుల నుంచి రెట్టింపు కంటే ఎక్కువగా ఆటోచార్జీలు వసూలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.  

– కాటిపల్లి మునీందర్‌రెడ్డి, తిమ్మాపూర్‌

చర్యలు తీసుకుంటాం 

జిల్లా కేంద్రంలో రాత్రిపూట ఆటోల వేగాన్ని నియ ంత్రించేందుకు చర్యలు చేపడతాం. రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ నిర్వహించే సిబ్బందితో నిఘా పెట్టించి వేగంగా వెళ్లే ఆటోలు, ద్విచక్రవాహనదారులపై చ ర్యలు తీసుకుంటాం. ప్రయాణికులను ఇబ్బదిపెట్టినట్లు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఆరోగ్యం, ట్రాఫిక్‌ ఎస్సై, జగిత్యాల  

మరిన్ని వార్తలు