చేవెళ్లలో నువ్వా.. నేనా!

2 Dec, 2018 16:21 IST|Sakshi
కాలె యాదయ్య,  కేఎస్‌ రత్నం, కంజర్ల ప్రకాశ్‌,

పట్టు కోసం కాంగ్రెస్‌ పోరాటం

సంక్షేమ పథకాలే అస్త్రంగా టీఆర్‌ఎస్‌ ప్రచారం

రోజురోజుకు బలపడుతున్న బీజేపీ

ఎస్సీ సామాజిక ఓట్లే కీలకం

అభ్యర్థులు పాత వారే.. గుర్తులు మారాయి

చేవెళ్ల నియోజకవర్గంలో రసవత్తర పోరు

చేవెళ్ల:   చేవెళ్ల నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్టుగా సాగుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నియోజకవర్గం 1952లో ఏర్పడిన నాటినుంచి ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువసార్లు కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధించింది. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి సెంటిమెంటుగా మారిన ఈ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది.  గతంలో తొమ్మిది పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టంకట్టిన   నియోజకవర్గం ప్రజలు మరోసారి గెలిపిస్తారని కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే  నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అస్త్రంగా టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపుకోసం ప్రయత్నిస్తోంది.             


ఎవరు ఎన్ని సార్లు గెలుపు
కాంగ్రెస్‌    –    9
టీడీపీ    –    4
జనతాపార్టీ    –    1
ఇండిపెండెంట్‌    –    1

ప్రస్తుత ఓటర్ల సంఖ్య
మొత్తం    –    2,21,887
పురుషులు     –    1,13,972
మహిళలు    –    1,07,893
ఇతరులు    –     22
పోలింగ్‌ కేంద్రాలు    –     292


నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్‌ స్థానంగా ఉన్న చేవెళ్ల  2009లో ఎస్‌సి రిజర్వుడుగా మారింది. దీంతో 25 సంవత్సరాలనుంచి అధికారంలో ఉన్న పట్లోళ్ల కుటుంబం మరోస్థానానికి బదిలీ కావాల్సి వచ్చింది. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కాలె యాదయ్యను రంగంలోకి దించగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా చేసిన అనుభవం ఉన్న కెఎస్‌.రత్నంను తెలుగుదేశంపార్టీ పోటీకి నిలిపింది. ఈపోటీలో టీడీపీ అభ్యర్థి కెఎస్‌ రత్నం గెలుపొందారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.  

ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలో  కేఎస్‌ రత్నం టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయగా,  కాంగ్రెస్‌పార్టీ నుంచి కాలె యాదయ్య రెండో సారి పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గం ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు జైకొట్టారు. అది కూడా  తెలంగాణవాదంతో ప్రత్యేక రాష్ట్రంలోని అధిక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే.. ఇక్కడ చేవెళ్ల గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా అని నిరూపించారు. గెలుపొందిన కాలె యాదయ్య కాంగ్రెస్‌పార్టీని వీడి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.  గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేఎస్‌. రత్నం  కాంగ్రెస్‌ పార్టీలో చేరి పోటీకి దిగారు.  


బలపడుతున్న బీజేపీ
ప్రస్తుత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి హిమాయత్‌నగర్‌ మాజీ సర్పంచ్‌ కంజర్ల ప్రకాశ్‌ పోటీచేస్తున్నారు.  ఇయన గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు.  బీజేపీకి నియోజకవర్గంలో బలమైన నాయకత్వం లేకపోవటంతో  ప్రధాన పార్టీగా పోటీలో ఉంటున్నా గెలుపు సాధించలేకపోతుంది. నియోజకవర్గంలోక్యాడర్‌ ఇప్పుడిప్పుడే  మెరుగుపడుతోంది. మరి ఇది వారికి ఏ స్థాయిలో కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే.  ఇక మిగిలిన ఆరు మందిలో ఒక్కరు జుట్టు భీమయ్య స్వతంత్ర అభ్యర్థి కాగా  మిగిలిన ఐదు మందిలో ఒక్కరు బీఎస్పీ పార్టీ నుంచి కె. సునిల్‌కుమార్, జైస్వరాజ్‌పార్టీ నుంచి  ఎ. నర్సింహులు, బహుజన రాజ్యం పార్టీ నుంచి ఉప్పరి శ్రీనివాస్, అలిండియా సమతాపార్టీ నుంచి జి. చిన్న మానిక్యం,   రిపబ్లికన్‌ పార్టీ అఫ్‌ ఇండియా నుంచి రవీందర్‌ మాలలు  చేవెళ్ల అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలమధ్యనే పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


సెంటిమెంటే ఆయుధంగా కాంగ్రెస్‌
చేవెళ్ల నియోజకవర్గం సెంటిమెంటు ప్రాంతమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భావించారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ కార్యక్రమమైనా, ప్రచారకార్యక్రమైనా , చివరకు ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైనా చేవెళ్లనుంచి ప్రారంభించడం ఆనవాయితీగా మార్చారు. అదే సంప్రదాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ కూడా పాటిస్తూ ఎన్నికల బస్సు యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించింది. చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ హోంశాఖ మంత్రి  సబితారెడ్డికి గట్టి క్యాడర్‌ ఉంది. ఆమె అదేశాలను పాటించి కాంగ్రెస్‌పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ఉన్న కేఎస్‌ రత్నం సైతం తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను టీఆర్‌ఎస్‌లో ఉండగానే తయారు చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్‌లోకి మారటం, ఆయన క్యాడర్‌కూడా కాంగ్రెస్‌లోకి రావటంతో మరింత బలం చేకూరింది.  


సంక్షేమ పథకాలే అస్త్రంగా టీఆర్‌ఎస్‌
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న కాలె యాదయ్య నాలుగున్నరేళ్ల కాలంలో  చేపట్టిన  సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారినప్పుడుఆయనతోపాటు కొంత మంది ప్రజాప్రతినిధులు మాత్రమే  టీఆర్‌ఎస్‌లోకి మారారు.  గ్రామాల్లో ఉన్న పూర్తిస్థాయి కాడ్యర్‌ మారలేదు.      నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో  కొత్తగా టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ను ఇప్పుడిప్పుడే తయారు చేసుకున్నారు. ఇతర పార్టీల నుంచి చేరుతున్నవారితో  పార్టీకి బలం పెరుగుతోందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజాధరణ ఉందని మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  ఇదే లక్ష్యంగా పార్టీ క్యాడర్‌ మొత్తం పనిచేస్తోంది.


సైలెంట్‌గా దూసుకుపోతున్న బీజేపీ    
భారతీయ జనతాపార్టీ నియోజకవర్గంలో సైలెంట్‌గా ప్రచారంలో దూసుకుపోతున్నది. అభ్యర్థి కంజర్ల ప్రకాశ్‌ గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని వేగవంతం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రచారం చేసే పనిలో ఉన్నారు. ప్రదాన మంత్రి నరేంద్రమోదీ చేపట్టిన  పథకాలే పార్టీకి అండగా నిలుస్తాయని అదేస్థాయిలో అభివృద్ది జరుగుతుందని  బీజేపీని గెలపించాలని కోరుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పూర్థిస్థాయిలో క్యాడర్‌ లేకపోయినా ప్రజలకు  కేంద్రం అందిస్తున్న పథకాలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. 


కనిపించని ఇతర పార్టీల ప్రచారం
ప్రధాన పార్టీలు మినహాయిస్తే పోటీలో ఉన్న  మిగత ఆరుగురు అభ్యర్థుల ప్రచారం ఎక్కడా కనిపించటం లేదు. ఒక్క బీఎస్పీ అభ్యర్థి  కె. సునిల్‌కుమార్, బహుజన రాజ్యం పార్టీ అభ్యర్థి ఉప్పరి శ్రీనివాస్‌లు ప్రచారం కొనసాగిస్తున్నారు. మిగతా అభ్యర్థుల ప్రచారం బహిరంగంగా ఎక్కడ కనిపించటం లేదు.  


నియోజకవర్గం వివరాలు
నియోజకవర్గంలో చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్, షాబాద్, నవాబుపేట  మండలాలు ఉన్నాయి. నియోజకవర్గం 2009లో ఎస్సీ నియోజకవర్గంగా  మారింది.  షాబాద్, నవాబుపేట మండలాల్లో ఎక్కువగా ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉండటంతో  నియోజకవర్గాన్ని ఎస్సీకి రిజర్వుడు చేశారు.   ఎస్సీ జనాభా తరువాత స్థానం బీసీలదే. బీసీ ఓటర్లు సైతం రెండో స్థానంలో ఉండటంతో బీసీ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు.  నియోజకవర్గం హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఉండటంతోపాటు నగర వాతావారణానికి ప్రజలు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. నియోజకవర్గంలోని మొయినాబాద్‌లో చిల్కూరి బాలాజీ దేవాలయం ఎంతో పేరుగాంచింది.  ప్రశాంతమైన వాతవారణంలో ఎలాంటి పొల్యూషన్‌ లేని ప్రాంతంగా చేవెళ్ల నియోజకవర్గం ఉంది.

మరిన్ని వార్తలు