ఎక్కడి నుంచైనా రేషన్‌

1 Apr, 2018 01:50 IST|Sakshi

నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి పోర్టబిలిటీ విధానం

ఒకే కార్డుపై వేర్వేరు జిల్లాల్లో వివిధ సరుకులు తీసుకునే వెసులుబాటు

టీ–రేషన్‌ యాప్‌ ద్వారా అందుబాటులో రేషన్‌ షాపుల వివరాలు

2.75 కోట్ల మంది కార్డుదారులకు ప్రయోజనం  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా (పోర్టబిలిటీ) ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) లబ్ధిదారులు నిత్యావసర సరుకులు తీసుకునే సదుపాయాన్ని పౌర సరఫరాలశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదివారం నుంచి (ఏప్రిల్‌ 1) ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇటీవలే నెలపాటు జిల్లాల పరిధిలో అమలు చేసిన పోర్టబిలిటీ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. ఇప్పటివరకు కార్డుదారులు తమకు కేటాయించిన రేషన్‌ షాపులోనే సరుకులు తీసుకోవాల్సి వచ్చేది. ఇల్లు మారినా, కొత్త ఇంటికి దగ్గరలో రేషన్‌ షాపున్నా కూడా పాత షాపులోనే సరుకులు తీసుకోవాల్సి వచ్చేది. పోర్టబిలిటీ విధానం ద్వారా ఈ పరిస్థితికి పౌర సరఫరాలశాఖ చరమగీతం పాడింది. 

ఒకే కార్డున్న కుటుంబం వేర్వేరు చోట్లా తీసుకోవచ్చు... 
రాష్ట్రంలో ఉన్న 85 లక్షల రేషన్‌కార్డుల ద్వారా 2.75 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందించేందుకు 17 వేల రేషన్‌ షాపులున్నాయి. వీటన్నిటినీ ఇప్పటికే ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. అంతేకాదు ఒకే రేషన్‌ కార్డులో ఉన్న సభ్యులు వేర్వేరు రేషన్‌ షాపుల్లో తమ అవసరానికి తగినట్లుగా సరుకులు పొందవచ్చు. ఉదాహరణకు కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే ఇద్దరు సభ్యులు తమ కోటాకు సంబంధించిన బియ్యాన్ని మహబూబ్‌నగర్‌లో, మరో ముగ్గురు మెదక్‌లోనూ తీసుకోవచ్చు.

అలాగే కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఆదిలాబాద్‌లో గోధుమలు తీసుకుంటే మరొకరు రంగారెడ్డిలో కిరోసిన్‌ తీసుకోవచ్చు. టీ–రేషన్‌ యాప్‌లో లొకేషన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా కార్డుదారుడికి దగ్గరలోని రేషన్‌ షాప్‌ వివరాలు గూగుల్‌ మ్యాప్‌లో ప్రత్యక్షమవుతాయి. సరుకులు తీసుకున్న వెంటనే లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తమ కోటాకు సంబంధించిన మొత్తం సమాచారం అందుతుంది. లబ్ధిదారులు వరుసగా ఏడాదిపాటు రేషన్‌ సరుకులు తీసుకోకపోయినా వారి కార్డును తొలగించరు. వాళ్లకు ఎప్పుడు అవస రముంటే అప్పుడు సరుకులు తీసుకోవచ్చు. పనుల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి పోర్టబిలిటీ విధానం ఎంతగానో దోహదపడనుంది.

పోర్టబిలిటీతో డీలర్లలో మార్పు: సీవీ ఆనంద్‌ 
జిల్లాల్లో ఇప్పటివరకు అమలు చేసిన పోర్టబిలిటీతో రేషన్‌ డీలర్లలో స్పష్టమైన మార్పు వచ్చిందని, ఎక్కువమంది తమ షాపుల్లో సరుకులు తీసుకునేలా సేవలు అందించడానికి పోటీ పడుతున్నారని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సమయ పాలన పాటిస్తూ కార్డుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారని వివరించారు. ఈ విధానంలో రేషన్‌ దుకాణాలకు ముందుగానే 10 నుంచి 15 శాతం ఎక్కువ సరుకులను కేటాయిస్తామన్నారు.  

>
మరిన్ని వార్తలు