కార్డు కష్టాలు

24 Aug, 2019 10:48 IST|Sakshi

కొత్త ఆహార భద్రత కార్డు మంజూరుకు బ్రేకులు  

పెండింగ్‌లో 1.63 లక్షల దరఖాస్తులు  

సాక్షి, సిటీబ్యూరో: కొత్త ఆహార భద్రత (రేషన్‌) కార్డుల మంజూరు నిలిచిపోయింది. కుప్పలు తెప్పలుగా పెరుకొని పోయిన దరఖాస్తుల్లో కొన్ని  క్షేత్ర స్థాయి విచారణకు నోచుకున్నప్పటికి మంజూరు మాత్రం పెండింగ్‌లో పడిపోయింది. దీంతో మిగిలిన దరఖాస్తుల్లో కదలిక లేదు. కొత్తగా ఆహార భద్రత కార్డుల మంజూరు కోసం పెండింగ్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌కు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ రూపొందించిన ప్రణాళిక కూడా ఉత్తదే అయింది. కనీసం పదిశాతం దరఖాస్తులు కూడా క్లియరెన్స్‌కు నోచుకోలేదు. పౌరసరఫరాల శాఖలో సిబ్బంది కొరత వెంటాడుతున్నప్పటికీ ఉన్న సిబ్బందితో పెండింగ్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌ కోసం ఉరుకులు పరుగులు చేసి కొన్నింటికి క్షేత్ర స్థాయి విచారణ పూర్తి చేసి అమోదించినప్పటికీ ఉన్నత స్థాయిలో మంజూరుకు అనుమతి లభించనట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన దరఖాస్తుల ఆమోదం సర్కిల్‌ స్థాయిలోనే పెండింగ్‌లో పడిపోయింది. మరికొన్ని దరఖాస్తులు కనీసం క్షేత్ర స్థాయి విచారణకు నోచుకోలేదు. దీంతో పెండింగ్‌ దరఖాస్తులకు పాత పరిస్థితి పునరావృత్తమైనట్లయింది.  

కుప్పలు తెప్పలుగా...
పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమో...క్షేత్ర స్థాయి సిబ్బంది  నిర్లక్ష్యమో...తెలియదు కానీ.. కొత్త ఆహార భద్రత కార్డుల దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడిపోయాయి. మీసేవా ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులపై కనీసం సిటిజన్‌ చార్టర్‌ కూడా అమలు కాలేదు. మీ సేవా ద్వారా ఆహార భద్రత (రేషన్‌) కార్డు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా కొత్త కార్డులు, రద్దయినా కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం ప్రతి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తు నమోదవుతున్నా.. పరిష్కారానికి కాలపరిమితి లేకుండా పోయింది. ఆన్‌లైన్‌ ద్వారా నమోదు దాని ప్రతులు సర్కిల్‌ ఆఫీసులకు చేరినా ఫలితం లేకుండా పోయింది. నెలలు కాదు కదా.. ఏళ్ల తరబడి కూడా  మెజార్టీ దరఖాస్తులు విచారణకు నోచుకోకుండా పెండింగ్‌లోపడిపోయాయి. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసేందుకు గత మూడునెలల క్రితం జూన్‌ మాసంలో పెండింగ్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌కు టార్గెట్లు విధించారు. వీటి పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రెండు కమిటీలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. దరఖాస్తులపై  క్షేత్రస్థాయి విచారణ అనంతరం  ఏడు రోజుల్లో కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆదేశాలకు... ఆచరణకు పొంతన లేకుండా పోయింది. వాస్తవంగా క్షేత్ర స్థాయి విచారణ తప్ప మిగిలి ప్రక్రియ మాత్రం ఆన్‌లైన్‌లోనే కొనసాగుతోంది. కానీ, తాజాగా కొత్త కార్డుల మంజూరుకు బ్రేకులు పడటంతో పెండెన్సీ మరింతగా పెరిగిపోయింది.

దరఖాస్తుల పరిస్థితి ఇలా....
గ్రేటర్‌ పరిధిలోని సుమారు 2,85,653  మంది  పేద కుటుంబాలు కొత్తగా ఆహార భద్రత(రేషన్‌) కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అందులో  క్షేత్ర స్థాయి విచారణ అనంతరం కేవలం 82,966 దరఖాస్తులను  ఆమోదించి. 34,027 దరఖాస్తులను తిరస్కరించారు. క్షేత్ర స్థాయి విచారణ లేకుండానే 1,63,475 దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టినట్లు పౌరసరఫరాల అధికార అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అత్యధిక దరఖాస్తులు హైదరాబాద్‌లో జిల్లాలో పెండింగ్‌లో ఉండగా, రెండో స్థానంలో మేడ్చల్, మూడో స్థానంలో రంగారెడ్డి జిల్లా  దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  దరఖాస్తుదారులు మాత్రం సర్కిల్‌ ఆఫీస్‌ల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. మహానగర పరిధిలో  సుమారు 16,09,812 కుటుంబాలు మాత్రమే ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నాయి. మరో మూడు లక్షల కుటుంబాలకు పైగా కార్డులు లేవు. 

మరిన్ని వార్తలు