అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డు

9 May, 2019 02:25 IST|Sakshi

జూన్‌ 1 నుంచి కార్డుల జారీ ప్రారంభించాలి: అకున్‌ సబర్వాల్‌

సాక్షి, హైదరాబాద్‌: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఉద్యోగులందరూ ఆ దిశగా పనిచేయాలని పౌరసరఫరాల కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ సూచించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులను జారీచేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన జూన్‌ 1 నుంచి రేషన్‌ కార్డుల జారీని వేగవంతం చేయాలని ఆదేశించారు. చీఫ్‌ రేషనింగ్‌ కార్యాలయం (సీఆర్‌ఓ) పరిధిలో రేషన్‌ కార్డుల జారీ, 6ఏ కేసుల పరిష్కారం, రేషన్‌ డీలర్ల నుంచి గోనె సంచుల సేకరణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి బుధవారం సీఆర్‌ఓ కార్యాలయంలో కమిషనర్‌ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డుల జారీని వేగం చేయడానికి శాఖ చర్యలు చేపట్టింది.

నలుగురు ఉన్నతాధికారులతో 2 కమిటీలను వేసి అవి చేసిన సిఫారసులు అమలయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డుల దరఖాస్తులను త్వరితగతిన ఎలా పరిష్కరించాలనే దానిపై హెచ్‌ఎండీఏ పరిధికి సంబంధించి ఇద్దరు, గ్రామీణ ప్రాంతాలకు చెంది మరో ఇద్దరు ఉన్నతాధికారులతో 2 కమిటీలు ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆ దరఖాస్తులను డీసీఎస్‌ఓలు, ఏసీఎస్‌ఓల లాగిన్‌కు వచ్చిన 7 రోజుల్లో కార్డుల జారీ పూర్తి చేయాలి’ అని అన్నారు.

మరిన్ని వార్తలు