డీలర్ల భర్తీకి కసరత్తు

8 Oct, 2018 07:23 IST|Sakshi

ఖమ్మం సహకారనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న రేషన్‌ దుకాణాల్లో డీలర్లను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. స్థానికంగా కిరోసిన్‌ హాకర్‌ ఉండి రేషన్‌ డీలర్‌ లేకుంటే వారికే స్థానికత ఆధారంగా రేషన్‌ దుకాణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపడుతోంది. జిల్లాలో 669 రేషన్‌ దుకాణాలు ఉండగా 53 షాపులకు డీలర్లు లేరు. వీటిలో ఖమ్మం డివిజన్‌లో 38ఉండగా కల్లూరు డివిజన్‌ పరిధిలో 15ఉన్నాయి.  ప్రస్తుతం ఆయా ప్రాం తాల్లోని ఇతర రేషన్‌ డీలర్లకు ఇన్‌చార్జి అపగించారు.  దీంతో సరుకులు పంపిణీలో స్థానికం గా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో డీలర్ల భర్తీకి ప్రభుత్వం ఉపక్రమించింది.

1994 నుంచి ఉన్నవారికే ప్రాధాన్యం..  
జిల్లాలో కిరోసిన్‌ హాకర్లను రాష్ట్ర ప్రభుత్వం 1994వ సంవత్సరంలో నియమించింది. ఆ ప్రాతిపదికన నాటి నుంచి అనేక మంది హాకర్లు వచ్చే కొద్ది గొప్పో ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాంటి వారికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలోని 53 రేషన్‌ దుకాణాల్లో 1994వ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్న వారికి మాత్రమే ఖాళీగా ఉన్న ప్రాంతంలో రేషన్‌ దుకాణాన్ని అప్పగించనున్నారు.
 
దరఖాస్తు ఇలా..  
జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్‌ దుకాణాలను ఆర్డీవోల పరిధిలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో కిరోసిన్‌ హాకర్‌ ఉండి రేషన్‌ డీలర్‌ లేకుంటే హాకరే దరఖాస్తు చేసుకుంటే రేషన్‌ దుకాణం రానున్నది. 53దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో స్థానికంగా ఉన్న వారికి మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు. హాకర్లు ఆయా ప్రాంతాల్లోని డివిజన్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే జిల్లా పౌరసరఫరాల శాఖలో ఎవరైనా దరఖాస్తును అందిస్తే వారు సైతం ఆర్డీవోకు పంపిస్తారు.

ఎంపిక పారదర్శకత  
జిల్లాలో రేషన్‌ డీలర్లను భర్తీ చేసేందుకు ఆర్డీవోలు పారదర్శకతతో వ్యవహరించనున్నారు. ఖమ్మం ఆర్డీవోగా సబ్‌ కలెక్టర్‌ ఉన్న దృష్ట్యా పారదర్శకంగా రేషన్‌ దుకాణానికి డీలర్‌గా ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం భర్తీ చేసే 53దుకాణాల్లో కిరోసిన్‌ హాకర్లు నియమ నిబంధనల ప్రకారం లేకుంటే ఎన్నికల అనంతరం కొత్తగా నోటిఫికేషన్లు వేసి కొత్త డీలర్లను ఎంపిక చేయనున్నారు.

నిబంధనలిలా...  
1994వ సంవత్సరం నుంచి కిరోసిన్‌ హాకర్‌గా ఉండాలి.  
 7వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.  
 వయసు నిబంధన లేదు.  

హాకర్లకే రేషన్‌ దుకాణాలు  
జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్‌ దుకాణాలను భర్తీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో 53రేషన్‌దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. అక్కడ కిరోసిన్‌ హాకర్‌ ఉంటే వారి సమీపంలోని ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం అక్కడి అధికారులు డీలర్లను ఎంపిక చేస్తారు.  
– సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, ఖమ్మం  

మరిన్ని వార్తలు