ఎవరి పట్టు వారిదే!

30 Jun, 2018 01:49 IST|Sakshi

సమ్మెపై వెనక్కు తగ్గని డీలర్లు, రాష్ట్ర ప్రభుత్వం

రేషన్‌ డీలర్లకు నోటీసులు

5 నుంచి సరుకుల పంపిణీకి ఏర్పాట్లు

కాంగ్రెస్‌ నుంచి డీలర్లకు సంపూర్ణ మద్దతు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం, రేషన్‌ డీలర్లకు మధ్య వేడి రాజుకుంటోంది. ఓ వైపు జూలై ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెపై రేషన్‌ డీలర్లు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు డీడీలు కట్టని డీలర్లపై చర్యలకు ప్రభుత్వం వెనుకాడటం లేదు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా డీల ర్లు రోడెక్కగా... డీలర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. జూలై 5లోగా తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు వెనకాడబోమని డీలర్లు హెచ్చరిస్తుంటే.. సరుకుల పంపిణీకి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.  

వేలమంది డీలర్లకు నోటీసులు
రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల మంది లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి బియ్యం, కిరోసిన్‌ సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకోసం మీ సేవ కేంద్రాల్లో రేషన్‌ సరుకుల కోసం డబ్బులు చెల్లించి, ఆర్‌ఓ (రిలీజ్‌ ఆర్డర్‌) తీసుకోవాలి. అయితే ఇంతవరకూ 17 వేల మంది డీలర్లలో 700 మంది వరకు మాత్రమే డీడీలు చెల్లించారు.

దీంతో డీడీలు కట్టని డీలర్లపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ కంట్రోలర్‌ ఆర్డర్‌–2016 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం, నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించి, వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ఉందని చెబుతూ డీలర్లకు నోటీసులు అందిస్తోంది. శుక్రవారం వేల సంఖ్యలో డీలర్లకు అధికారులు నోటీసులు అందించారు.  

సస్పెన్షన్‌పై ఆచితూచి..
నోటీసులు అందుకున్న డీలర్లను సస్పెండ్‌ చేసే ఉత్తర్వులపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. సస్పెన్షన్‌పై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఢిల్లీ పర్యటన లో ఉండటంతో శనివారం న్యాయ సలహా తీసుకొని, అనంతరం సస్పెన్షన్‌ ఉత్తర్వులపై ముం దుకెళ్లే అవకాశాలున్నాయి.

డీలర్లు వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో సరుకుల పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గుర్తించిన మహిళా సంఘాలకు సరుకులను చేరవేసేందుకు రవాణా వాహనాలను, సరుకుల లోడింగ్‌ కోసం హమాలీలను సిద్ధం చేసుకునే పనుల్లో వేగం పెంచింది.

కాంగ్రెస్‌ మద్దతు
డీలర్ల సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి మద్దతు లభించింది. ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డీలర్లకు మద్దతు ప్రకటించారు. వారి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.

గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. రేషన్‌ డీలర్ల పట్ల కేసీఆర్‌ క్రూరంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.  డీలర్లపై ప్రభుత్వ దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వ నిర్వాకం వల్లే డీలర్‌ వాజిర్‌ ఖాన్‌ ఆత్మహత్యయత్నం చేశారని అన్నారు.  

మరిన్ని వార్తలు