రేషన్‌ డీలర్ల సమ్మె విరమణ

4 Jul, 2018 01:04 IST|Sakshi

ఈటల చొరవతో చర్చలు సఫలం.. బకాయిల విడుదలకు సుముఖం

కమీషన్‌ పెంపుపై సీఎంతో చర్చించాక నిర్ణయిస్తామన్న మంత్రి

కనీస వేతనాలపై కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి

నెల రోజుల్లో పరిష్కరించకుంటే మళ్లీ సమ్మె: డీలర్ల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ డీలర్లు ఈ నెల ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించారు. సమస్యల పరిష్కారంపై మంగళవారం ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో వారికి స్పష్టమైన హామీ లభించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. విడతల వారీగా బకాయిల విడుదలకు ప్రభుత్వం ఓకే చెప్పగా, కమీషన్ల పెంపు, కనీస గౌరవ వేతనంపై సీఎం కేసీఆర్‌ చర్చిం చి నిర్ణయం చేస్తామన్న ప్రభుత్వ హామీ నేపథ్యంలో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్‌ డీలర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు.

కనీస వేతనాల అమలు, పెండింగ్‌ బకాయిల విడుదల, కమీషన్‌ పెంపుపై గత కొన్ని రోజులుగా డీలర్లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పలుమార్లు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల ఒకటి నుంచి డీలర్లు సమ్మెకు దిగారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వారికి నోటీసులివ్వడంతో పాటు ప్రత్యామ్నాయంగా మహిళా సంఘాలతో సరుకుల పంపిణీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేసింది.  

కమీషన్లు, బకాయిలపై చర్చ
డీలర్లపై సస్పెన్షన్లకు సైతం ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న నేపథ్యంలో డీలర్లు మంగళవారం మినిష్టర్‌ క్వార్టర్స్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మరో దఫా చర్చలు జరిపారు. వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఈ చర్చలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మరోమారు తమ సమస్యలను డీలర్లు ఏకరువు పెట్టారు. చాలా రాష్ట్రాల్లో డీలర్లకు క్వింటాల్‌పై రూ.70కి పైనే కమీషన్లు ఇస్తున్నా, రాష్ట్రంలో కేవలం రూ.20 మాత్రమే ఇస్తున్నారని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రూ.70 కమీషన్‌లో కేంద్ర వాటా రూ.35 ఇవ్వాల్సి ఉన్నా, దానిని ఇవ్వడం లేదని తెలిపారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన 2014 అక్టోబర్‌ ఒకటి నుంచి మొత్తంగా రూ.300కోట్ల బకాయిలు ఉన్నాయని, వీటిని త్వరగా విడుదల చేయాలని కోరారు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ కమీషన్లు పెంచుతామని, అయితే ఎంత చేయాలన్న దానిపై సీఎంతో చర్చించి నిర్ణయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు.

కనీస వేతనాలపై కమిటీ
డీలర్ల కనీస వేతనాల అమలుపై కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ నిర్ణయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల హామీనిచ్చారు. అప్పటివరకు సమ్మె విరమించాలని కోరారు. ఒకట్రెండు రోజు ల్లో మరోసారి భేటీయై సమస్యలపై చర్చిద్దామన్నారు. దీనికి అంగీకరించిన డీలర్లు సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు.

ఇక సరుకులకై డీడీలు కట్టేందుకు గడువు ముగిసినందున, 4 రోజులు గడువు పొడిగించాలని విన్నవించారు. దీనికి ఈటల ఓకే చెప్పారు. సమావేశం అనంతరం డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. డీలర్ల సమ్మె విరమణ హర్షదాయకమని, వారి డిమాండ్లపై సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. డీలర్ల సమ్మె విరమణను పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వాగతించారు.


సీఎం కేసీఆర్‌పై నమ్మకముంది: డీలర్ల సంఘం
తమ సమస్యలు పరిష్కరించి, న్యాయం చేస్తారనే నమ్మకం సీఎం కేసీఆర్‌పై ఉందని రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు, దాసరి మల్లేశం అన్నారు. అందుకే సమ్మె విరమిస్తున్నామని వారు తెలిపారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు