రేషన్..పరేషాన్

13 May, 2014 03:11 IST|Sakshi

మోర్తాడ్, న్యూస్‌లైన్:  రేషన్ వినియోగదారులకు రెండు నెలలుగా పామోలిన్, గోధుమలు సరఫరా కాక పోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా 9 రకాల సరుకులను సబ్సిడీ ధరపై ప్రభుత్వం సరఫరా చేసేది. తెల్ల రంగు కార్డుల వినియోగదారులకు సబ్సిడీ ధరపై పామోలిన్, పంచదార, గోధుమ పిండి, గోధుమలు, పసుపు, మిరప్పొడి, చింతపండు, ఉప్పు, కందిపప్పులను  185కు విక్రయించేవారు. అమ్మహస్తం పథకం సరుకులతో పాటు రూపాయికి కిలో బియ్యం, కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. తొమ్మిది రకాల సరుకులను సరఫరా చేయాల్సి ఉండగా, పామోలిన్, గోధుమలను మాత్రం అందివ్వడం లేదు.

గోధుమలు మార్కెట్‌లో కిలోకు 14 ధర ఉండగా రేషన్ దుకాణంలో మాత్రం కిలో ఏడు రూపాయలకు లభిస్తాయి. పామోలిన్ లీటర్ ప్యాకెట్ ధర మార్కెట్‌లో 60 ఉండగా అమ్మహస్తం పథకం ద్వారా 40 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు. పామోలిన్, గోధుమలకు డిమాండ్ ఉండగా ఆ సరుకులు మాత్రం సరఫరా కావడం లేదు. చింత పండు, పసుపు, కందిపప్పు, గోధుమ పిండి నాసిరకంగా ఉండటంతో వాటిని తీసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. పౌర సరఫరాల శాఖ గోదాంలలో గోధుమలు, పామోలిన్ నిలువలు తగ్గిపోవడంతో జిల్లాకు రావాల్సిన 70 టన్నుల గోధుమలు సరఫరా కాలేదు.

అలాగే ఏడు లక్షల పామోలిన్ ప్యాకెట్‌లు కూడా సరఫరా కాలేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల తెలుపు రంగు కార్డుల వినియోగదారులు ఉన్నారు. ప్రతి నెల అన్ని రకాల సరుకులు సరఫరా అయితేనే వినియోగదారులకు అధికారులు డీలర్ల ద్వారా అమ్మహస్తం పథకం ద్వారా సరుకులను అందిస్తారు. ఎన్నికల బిజీలో ఉన్న అధికారులు సరుకులు సరఫరా కాక పోవడంపై శ్రద్ధ చూపక పోవడంతో రేషన్ వినియోగదారులకు అవసరం ఉన్న పామోలిన్, గోధుమలు సరఫరా కావడం లేదు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి  గోధుమలు, పామోలిన్ సరఫరా అయ్యేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు