ఐరిష్‌తో రేషన్‌

8 Aug, 2018 08:03 IST|Sakshi

అక్టోబర్‌ 1 నుంచి ఐరిష్‌ విధానంలో సరుకులు

సిద్ధమవుతున్న పౌర సరఫరాల శాఖ

ఈ–పాస్‌ మిషన్లకు చెల్లుచీటి

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  పేద కుటుంబాలకు సబ్సిడీపై అందజేస్తున్న రేషన్‌ సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత రానుంది. ఇకపై ఐరిష్‌ (కనుపాప) విధానంలో లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు. అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెల 15 నుంచి 25వ తేదీల మధ్య ఈ విధానం ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. జిల్లా సరఫరాల శాఖ సిద్ధమవుతోంది. అక్టోబర్‌ ఒకటి నుంచి ఐరిష్‌ విధానంలో కార్డుదారులకు సరుకులు పంపిణీ చేస్తారు.

కార్డుదారుల వేలిముద్రల ఆధారంగా ఈ–పాస్‌ మిషన్ల ద్వారా సరుకులు అందజేస్తున్న పద్ధతికి చరమగీతం పాడనున్నారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా కూడా సరుకుల పంపిణీలో అడపాదడపా అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఐరిష్‌ విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వేలిముద్రల విధానం కంటే మరింత సులభంగా, వేగంగా ఐరిష్‌ పద్ధతిలో సరుకులను పంపిణీ చేయొచ్చని చెబుతున్నారు.

కొత్తగా ఆధార్‌ నమోదు చేసిన సమయంలోనే లబ్ధిదారుల చేతి వేలిముద్రలు, ఐరిష్‌ (కనుపాప)ను అనుసంధానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్డుదారుడు, వారి కుటుంబ సభ్యుల నుంచి మరోసారి ఐరిష్‌ సేకరించాల్సిన పనిలేదు. కాకపోతే ఇప్పుడున్న ఈ–పాస్‌ మిషన్ల స్థానంలో కొత్తగా ఐరిష్‌ కాప్చర్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చి సరుకులు పంపిణీ చేయనున్నారు.  

దశల వారీగా సంస్కరణలు.. 

రేషన్‌ సరుకుల పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం దశల వారీగా సంస్కరణలు చేపడుతోంది. తొలుత రేషన్‌ కార్డుకు ఆధార్‌ నంబర్‌ను అనుసంధానించి బోగస్‌ కార్డులను ఏరివేసింది. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా ఈ–పాస్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చి వేలిముద్రల ద్వారా సరుకులను పంపిణీ చేస్తోంది. తొలుత జీహెచ్‌ఎంసీ పరిధిలో 2016 మార్చి నుంచి అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో దీన్ని మన జిల్లా గ్రామీణ ప్రాంతానికి గతేడాది జూలైలో విస్తరించారు.

దీని ఫలితంగా సరుకులు పక్కదారిపట్టడం దాదాపు తగ్గిపోయింది. నెలకు సగటున 25 నుంచి 27 శాతం కోటా ప్రతినెలా మిగులుతూ వస్తోంది. జిల్లాలో ఈ–పాస్‌ అమలుకు ముందు ప్రతినెలా 11,024 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేశారు. ఈ–పాస్‌ వినియోగంలోకి వచ్చాక ఈ కోటా 8,300 మెట్రిక్‌ టన్నులకే పరిమితమవుతోంది. అంటే ప్రతినెలా సగటున 2,700 మెట్రిక్‌ టన్నుల కోటా మిగులుబాటు అవుతోంది.

అయితే, ఈ పద్ధతిలోనూ ఆయా జిల్లాల్లో బియ్యం పక్కదారి పడుతున్నట్లు సర్కారు గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఐరిష్‌ విధానంలో సరుకులు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. తొలుత రాష్ట్రంలో ఈనెల 15 నుంచి  నాలుగు జిల్లాల్లో అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ విజయమైతే రెండో దశలో వచ్చేనెల తొలివారంలో మరికొన్ని జిల్లాల్లో, మూడో దశలో మన జిల్లాకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

మరో 7శాతం మిగులు..

బయోమెట్రిక్‌ విధానంలో సగటున ప్రతినెలా 25 శాతం బియ్యం కోటా మిగులుతున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఐరిష్‌ విధానాన్ని అమలు చేస్తే మరో 7 శాతం (581 మెట్రిక్‌ టన్నులు) వరకు కోటా ఆదా అవుతుందని పౌర సరఫరాల అధికారులు అంచనా వేస్తున్నారు.

అలాగే బయోమెట్రిక్‌ విధానంలో కుష్టువ్యాధి గ్రస్తులు, చేతులు లేని, వేలి ముద్రలు చెరిగిపోయిన లబ్ధిదారులు సరుకులు పొందాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఐరిష్‌ విధానంలో ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. ‘వచ్చే నెలలో మన జిల్లాలో ఐరిష్‌ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని మాకు ఆదేశాలు అందాయి. బయోమెట్రిక్‌ కంటే ఐరిష్‌ విధానం అత్యుత్తమం. లబ్ధిదారులు సులభంగా సరుకులు పొందవచ్చు’ అని జిల్లా సరఫరాల అధికారి రమేష్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు