ఐరిస్‌తోనూ రేషన్‌ సరుకులు

5 Jan, 2019 02:27 IST|Sakshi

16 జిల్లాల్లో 5,186 షాపుల్లో ప్రారంభం

నాలుగు రోజుల్లో 15.20 లక్షల మందికి సరుకుల పంపిణీ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపంపిణీ ద్వారా రేషన్‌ సరుకులు తీసుకునే లబ్ధిదారులకు సులువుగా, ప్రయోజనం కలిగించేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. వేలిముద్రలతోపాటు కనుపాపల (ఐరిస్‌) ఆధారంగా లబ్ధిదారులకు సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈనెల 1 నుంచి మొదటి విడతలో 16 జిల్లాల్లో 5,186 దుకాణాల్లో ఈ విధానం ప్రారంభించింది. దాదాపు ఏడాది నుంచి పౌరసరఫరాల శాఖ ఈపాస్‌ (బయోమెట్రిక్‌) విధానం ద్వారా సరుకుల పంపిణీ చేస్తోంది. అయితే ఈ విధానంలో వృద్ధులు, మహిళల వేలిముద్రలు అరిగిపోవడం వల్ల ఈపాస్‌ మెషీన్‌లు ధ్రువీకరించడం లేదు. దీంతో ప్రతినెలా రేషన్‌ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లబ్ధిదారులు అసౌకర్యానికి గురికావద్దనే ఉద్దేశంతో వేలిముద్రలు సరిపడని చోట ఆయా ప్రాంతాల్లో వీఆర్‌వో, వీఏవో, పౌరసరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్లకు లబ్ధిదారులను ప్రామాణీకరించే సౌకర్యం కల్పించింది. అయితే ఈ విధానం కొన్ని చోట్ల దుర్వినియోగమవుతున్న విషయం పౌరసరఫరాల అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

ఈ సమస్యలను అధిగమించడానికి ఐరిస్‌ విధానం పరిష్కారమని భావించిన ఆ శాఖ అధికారులు రాష్ట్రంలోని 17,200 రేషన్‌ షాపుల్లో దశల వారీగా ఐరిస్‌ విధానం అమలుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలోని రేషన్‌ షాపుల్లో ఐరిస్‌ విధానం అమలు తీరును పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సభర్వాల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ త్వరలో అన్ని షాపుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా, అర్హులైన పేదలకు మరింత సులువుగా నిత్యావసర సరుకులు అందించడానికి ఐరిస్‌ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 5,186 దుకాణాల్లో ఈనెల ఒకటవ తేదీ నుండి ఐరిస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని, ఈ నాలుగు రోజు ల్లో 15.20 లక్షల మంది రేషన్‌ సరుకులు తీసుకున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు