ఎక్కడి నుంచైనా.. 

1 Apr, 2018 09:50 IST|Sakshi
రేషన్‌ దుకాణం

రేషన్‌ సరుకులు తీసుకోవచ్చు

నేటి నుంచే అమలులోకి కొత్త విధానం

వలస వెళ్లిన వారికి ఎంతో ఊరట

సమీప దుకాణంలో తీసుకునే అవకాశం

సాక్షి, కామారెడ్డి : రేషన్‌ వినియోగదారులకు శుభవార్త.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరుకులు పొందే అవకాశం నేటి నుంచి అమల్లోకి రానుంది. తద్వారా వలస జీవులకు ఊరట కలగనుంది. రేషన్‌ పంపిణీలో బయోమెట్రిక్‌ విధానం అమల్లోకి వచ్చిన తరువాత సరకులు తీసుకోవడానికి వినియోగదారులు ఎక్కడ ఉన్నా సొంత గ్రామానికి రావలసి వచ్చేది. కొన్నిసార్లు రేషన్‌ సరకులు తీసుకోవడానికి ఇబ్బందులకు గురయ్యేవారు. కొందరు రేషన్‌ దుకాణాల డీలర్లకే వదిలేసే పరిస్థితి ఉండేది. 

అయితే, ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానంతో ఇకపై ఆ ఇబ్బంది తొలగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పోర్టబిలిటీ పద్ధతి’ ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు మంచి అవకాశం కల్పించింది. బతుకుదెరువు కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వలస వెళ్లిన వినియోగదారులు తాము ఉంటున్న చోట అందుబాటులో ఉన్న రేషన్‌ దుకాణానికి వెళ్లి సరకులు తీసుకునే అవకాశం ఏర్ప డింది.  కామారెడ్డి జిల్లాలో 2.46 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతీ నెలా 5,400 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది.

చాలా మంది బతుకుదెరువు కోసం సమీప పట్టణాలకో, నగరాలకో వలస వెళ్లారు. అయితే, ప్రతీ నెల రేషన్‌ సరుకులు సొంత గ్రామానికి వెళ్లి తీసుకోవలసి వచ్చేది. రేషన్‌ సరకులు సరఫరా చేస్తున్న రోజుల్లో ఏదో ఒ క రోజు గ్రామానికి వెళ్లి సరకులు తీసుకునే వారు. వరుస గా మూడు నెలల పాటు సరకులు తీసుకోనట్టయితే రేషన్‌ కార్డు రద్దవుతుందన్న భయంతో ఎంత దూరం ఉన్నా స రే, ఎంత ఖర్చయినా సరే షాపునకు వెళ్లి సరుకులు తీసుకునే వారు. అయితే, ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానం తో పాటు పోర్టబిలిటీని కూడా అమలులోకి తేవడంతో రే షన్‌ సరుకులు ఎక్కడైనా తీసుకునే అవకాశం లభించనుంది. రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా సరే తమ రేషన్‌ కార్డును తీసుకెళ్తే చాలు అక్కడ సరుకులు ఇచ్చేస్తారు. తద్వారా వినియోగదారులకు వ్యయ ప్రయాసలు తగ్గినున్నాయి. 

లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం.. 
ఎక్కడున్నా రేషన్‌ సరుకులు తీసుకోవడానికి ఆస్కారం కల్పించడంతో లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్లు ఒక చోట, రేషన్‌ షాపులు మరో చోట ఉంటాయి. తమకు సమీపంలో రేషన్‌ దుకాణాలు ఉన్నప్పటికీ ఇంత కాలం అక్కడ రేషన్‌ తీసుకునే అవకాశం లేకుండేది. అయితే పోర్టబిలిటీ విధానంతో తమకు అందుబాటులో ఉన్న షాపునకు వెళ్లి రేషన్‌ సరకులు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. దీంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.  . 

>
మరిన్ని వార్తలు