గంటల కొద్దీ క్యూలోనే..

6 Apr, 2020 10:30 IST|Sakshi
న్యూ బోయిగూడ వద్ద రేషన్‌ కోసం మహిళల నిరీక్షణ

సగానికి పైగా తెరుచుకున్న ప్రభుత్వ చౌకధరల దుకాణాలు

వేగవంతమైన రేషన్‌ బియ్యం పంపిణీ

ఐదు రోజుల్లో 6.19 లక్షల కుటుంబాలకు అందజేత

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం కోసం పేదలకు పడిగాపులు తప్పడం లేదు. ఆదివారం సగం దుకాణాలు మాత్రమే తెరుచుకున్నాయి. మిగతా షాపుల వద్ద ఆహార భద్రత కార్డుదారులు రేషన్‌ కోసం గంటల కొద్ది వేచి ఉన్నా ఫలితం లేకుండా పోయింది. వరుసగా నాలుగు రోజులు పరిమిత దుకాణాలు..ఆ తర్వాత మొత్తం షాపుల ద్వారా ఉచిత బియ్యం అందిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. పేదలు మాత్రం ఉదయం ఆరు గంటలకే రేషన్‌షాపుల వద్దకు చేరుకుని భారీగా బారులు తీరారు. కొన్ని చోట్ల భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ కారణంగా గుంపులు గుంపులుగా నిలబడటం కనిపించింది. రేషన్‌ కోసం ఎగబడటం, కనీసం మాస్క్‌లు కూడా ధరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

పనిచేయని పోర్టబిలిటీ
రేషన్‌ పోర్టబిలిటీ ముప్పు తిప్పలు పెడుతోంది. హైదరాబాద్‌ మహా నగరంలో ఇతర జిల్లాల వారు అధికంగా ఉన్న కారణంగా పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఈ–పాస్‌ డాటాలో సాంకేతిక సమస్యల కారణంగా పోర్టబిలిటీలో బయోమెట్రిక్‌ గుర్తింపు సమస్యగా తయారైంది. దీంతో సుమారు 20 శాతం లబ్ధిదారులకు నిరాశ తప్పడంలేదు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోర్టబిలిటీ తీరు ఇలా ఉంటే జాతీయ పోర్టబిలిటీ అసలుకే పనిచేయడం లేదు. ఏపీకి చెందిన తెల్లరేషన్‌ కార్డుదారులు పోర్టబిలిటీ విధానంలో రేషన్‌ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.

ఐదురోజుల్లో ఇలా...
మహా నగర పరిధిలో ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది. ఐదో రోజు నాటికి సుమారు 6.19 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం చేరింది. ఆదివారం మొత్తం షాపుల్లో సగానికి పైగా తెరుచుకున్నాయి. దీంతో ఉచిత బియ్యం పంపిణీ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. గత ఐదురోజుల్లో జరిగిన బియ్యం పంపిణీ జిల్లాల వారిగా పరిశీలిస్తే... హైదరాబాద్‌ జిల్లా పరిధిలో మొదటి రోజు 7600 కుటుంబాలకు 3,51,446 కిలోల బియ్యం, రెండో రోజు 8324 కుటుంబాలకు 3,92,677 కిలోలు, మూడో రోజు 9428 కుటుంబాలకు 4,50,440 కిలోలు, నాల్గో రోజు 55035 కుటుంబాలకు 25,14,215 కిలోల బియ్యం పంపిణీ చేశారు. నాలుగు రోజుల్లో మొత్తం 83088 కుటుంబాలకు 36,88,778 కిలోల పంపిణీ జరగ్గా, కేవలం ఐదో రోజు సుమారు 85 వేలకు పైగా కుటుంబాలకు బియ్యం పంపిణీ జరిగినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక రంగారెడి జిల్లా పరిధిలో పరిశీలిస్తే మొదటిరోజు 32,479 కుటుంబాలకు 12,86,951 కిలోలు, రెండో రోజు 73828 కుటుంబాలకు 30,37,803 కిలోలు, మూడో రోజు 48377 కుటుంబాలకు 19,66,791 కిలోలు, నాల్గో రోజు 77365 కుటుంబాలకు 31,43, 497 కిలోల బియ్యం పంపిణీ చేశారు. మొత్తం నాలుగు రోజుల్లో 232049 కుటుంబాలకు 94,35,042 కిలోల బియ్యం పంపిణీ జరిగితే,  ఐదో రోజు 49వేలకు పైగా కుటుంబాలకు బియ్యం అందజేసినట్లు సమాచారం.
అలాగే మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పరిధిలో పరిశీలిస్తే... మొదటి రోజు 10558 కుటుంబాలకు 4,17,758 కిలోల బియ్యం, రెండో రోజు 17241 కుటుంబాలకు 7,01,991 కిలోలు, మూడో రోజు 12598 కుటుంబాలకు 5,17,796 కిలోలు, నాల్గో రోజు 51734 కుటుంబాలకు 21,78,325 కిలోల బియ్యం పంపిణీ చేశారు. మొత్తం నాలుగు రోజుల్లో  92131 కుటుంబాలకు 38,15,870 కిలోలు పంపిణీ జరగ్గా, ఐదు రోజు 78 వేలకు పైగా కుటుంబాలకు బియ్యం పంపిణీ జరిగినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు