దొరికితేననే దొంగలు

14 Dec, 2019 10:19 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : రేషన్‌బియ్యం అక్రమ రవాణా రూటు.. తీరు రెండూ మారిపోయాయి. మొన్నటి వరకు ఎంచుకున్న రూట్ల ద్వారా లారీల్లో బియ్యాన్ని అక్రమంగా కర్ణాటక సరిహద్దు దాటవేసిన అక్రమార్కులు కొన్నాళ్ల నుంచి తమ పంథాను మార్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నచిన్న గ్రామాల మీదుగా బొలెరోలు, డీఎంసీలు, టాటా ఏసీల్లో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. పేదల బియ్యం 
అక్రమ తరలింపు విషయాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుంటోన్నా ఉమ్మడి జిల్లాలో మాత్రం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. సంబంధిత అధికారుల వైఫల్యం.. ఉదాసీనతతో పేదల కడుపు నింపాల్సిన రేషన్‌ బియ్యం అక్రమార్కుల జేబులను నింపుతోంది. మరోవైపు బియ్యం అక్రమార్కులకు రాజకీయ నేతల అండదండలున్నాయని.. అందుకే వారి జోలికి వెళ్లేందుకు పౌరసరఫరాలు..రెవెన్యూ.. పోలీసు అధికారులూ సాహసించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

బియ్యానికి బదులు డబ్బులు..  
ప్రస్తుతం చాలా మంది లబి్ధదారులు రేషన్‌ బియ్యం తినడం లేదు. దీంతో ప్రతి నెలా బియ్యం మిగిలిపోతోంది. దీన్ని గ్రహించిన కొంతమంది డీలర్లు వారిని కలిసి బియ్యం తీసుకున్నట్లు వేలిముద్ర వేయాలని అందుకు కిలో బియ్యానికి రూ.8 నుంచి రూ.10 చొప్పున ఇస్తామని మాట్లాడుకున్నారు. దీనికి లబ్ధిదారులు కూడా డీలర్లు చెప్పినట్టే చేస్తున్నారు. ఇలా లబి్ధదారుల నుంచి పొందిన బియ్యాన్ని పలువురు డీలర్లు తమ గోదాముల్లో దాచి పెట్టుకుని వాటిని రైస్‌మిల్లర్లు, దళారులకు కిలోకు రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల అధికారుల తనిఖీల్లో ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆయా షాపుల్లో ఉండాల్సిన బియ్యం కంటే ఎక్కువగా ఉండడంతో అధికారులు ఆయా డీలర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. కేవలం మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే గడిచిన రెండు నెలల్లో 16మంది డీలర్ల డీలర్‌íÙప్‌ను ఇదే కారణంతో రద్దు చేయడం గమనార్హం. 

టాస్క్‌ఫోర్స్‌కు బ్రేక్‌? 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరుగా కొనసాగుతున్న రేషన్‌బియ్యం అక్రమ రవాణాను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం నాలుగు నెలల క్రితం టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా అధికారులకు తెలియకుండానే హైదరాబాద్‌కు చెందిన పౌరసరఫరాల అధికారులు దాడులు నిర్వహించి కేసులు వేలాది క్వింటాళ్ల బియ్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. గద్వాల    కేంద్రంగా    బియ్యం అక్రమ రవాణా    జరుగుతుందని నిర్ధారణకు వచ్చారు. టాస్‌్కఫోర్స్‌ అధికారుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన అక్రమార్కులు కొన్నాళ్లు తమ దందాను ఆపేద్దామనే నిర్ణయానికి వచ్చారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ గత రెండు నెలల నుంచి జిల్లాలో టాస్‌్కఫోర్స్‌    బృందం   పత్తాలేకుండా పోయింది. దీంతో అక్రమార్కులు రూటు, తీరును మార్చుకుని బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు.    కేటీదొడ్డి   మండలం నందిన్నె, గట్టు మండలం బొలిగేరి వద్ద చెక్‌పోస్టులు ఉండడం.. అక్కడ సీసీ కెమెరాలు ఉండడంతో ఇతర మార్గాల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. అక్కడ కిలోకు రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.  

వనపర్తిలో పీడీ యాక్ట్‌.. 
బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలనే డిమాండ్‌ బలంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉండడంతో మూడేళ్లుగా.. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం అక్రమ దందా చేస్తూ.. ఏడుసార్లు అధికారులకు, పోలీసులకు పట్టుబడ్డ వనపర్తి జిల్లా అమరచింత మండలానికి చెందిన దాసరి రాజశేఖర్‌పై ఎస్పీ అపూర్వరావు అక్టోబర్‌ 1వ తేదీన పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఈ నెల 10న ఈ విషయాన్ని పరిశీలించిన రాష్ట్ర పీడీ యాక్టు అడ్వైజరీ బోర్డు ఎస్పీ చర్యను సమరి్థస్తూ రాజశేఖర్‌కు మరో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. బియ్యం అక్రమ రవాణాలో గద్వాల కింగ్‌గా పేరొందిన ఓ మిల్లర్‌ విషయంలో అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

తూకంలో మోసం చేస్తున్నారు  
మహబూబ్‌నగర్‌ జిల్లాలో రేషన్‌ డీలర్లు తూకంలో మోసం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. లబి్ధదారులకు తక్కువ తూకం వేసి మిగిలిన బియ్యాన్ని ఏం చేసుకుంటున్నారో మాకు తెలియదు. డీలర్లు తూకాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవు. లబి్ధదారులు మాకు ఫిర్యాదు చేయవచ్చు. 
– వనజాత, జిల్లా పౌరసరఫరాల అధికారి, మహబూబ్‌నగర్‌ 

గతంలో బియ్యం అక్రమ తరలింపు రూటు.. 
గద్వాల ధరూర్‌ అల్లాపాడు, కేటీదొడ్డి, నందిన్నె చెక్‌పోస్టుల మీదుగా కర్ణాటకలోని రాయచూర్‌లో ప్రవేశించేవి.  

ప్రస్తుతం తరలింపు రూటు
ఆత్మకూరు డ్యాం నర్సన్‌దొడ్డి,  దాగ్యదొడ్డి, నిలహళ్లి, పాతపాలెం, ఈర్లబండ,  వెంకటాపురం, ఇర్కిచెడుల మీదుగా అర్తిగేరి కర్ణాటక సరిహద్దు సింగానేడులో ప్రవేశిస్తుంది. ∙గద్వాల, ధరూర్, అల్లపాడ్, మైలగడ్డ, రంగపురం, మల్లపురం, కుచినెర్ల సుల్తాన్‌పురంల మీదుగా కర్ణాటక బాపురంలో ప్రవేశిస్తుంది.  మల్దకల్‌ నుంచి బీజ్వరం, పెంచికల్‌పాడు, రాయపురం, చింతకుంట మీదుగా కర్ణాటకలోని ఉండ్రాలు దొడ్డికు తరలిస్తున్నారు. (మహబూబ్‌నగర్, బిజినేపల్లి, కల్వకుర్తి నుంచి పెద్ద మొత్తంలో రేషన్‌ బియ్యం గద్వాలకు చేరవేస్తారు. అక్కడ బియ్యం మాఫియా కింగ్‌గా పేరొందిన ఓ మిల్లర్‌ ద్వారా పేదల బియ్యాన్ని కర్ణాటకు తరలిస్తున్నారు).

మరిన్ని వార్తలు