గుట్టుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్

19 Jul, 2014 00:52 IST|Sakshi

 కీసర: రేషన్ బియ్యం రీసైక్లింగ్ గుట్టును అధికారులు రట్టు చేశారు. ఓ రైస్‌మిల్లుపై దాడి చేసి 650 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండల పరిధిలోని అహ్మద్‌గూడలో శుక్రవారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం నివాసి చంద్రమౌళి నిరుపేదలకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని కొన్నేళ్లుగా గ్రామాల నుంచి దళారుల ద్వారా సేకరిస్తున్నాడు. కీసర మండల పరిధిలోని అహ్మద్‌గూడలో ఉన్న ఓ రైస్‌మిల్లులో గుట్టుగా రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు.

 రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యాన్ని గురువారం లారీలో బహిరంగ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమవుతుండగా విశ్వసనీయ సమాచారంతో రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. రైస్‌మిల్లులో నిల్వ ఉంచిన బియ్యం, మార్కెట్‌కు తరలించేందుకు లారీలో ఉన్న బియ్యంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్‌జోన్ సివిల్ సప్లై అధికారి సురేష్ విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల నిమిత్తం బియ్యాన్ని ల్యాబ్ పంపినట్లు తెలిపారు. రైస్‌మిల్లును సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కీసర తహసీల్దార్ రవీందర్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు