ఇదో ఒప్పంద దందా!

24 Jul, 2019 12:18 IST|Sakshi

ఆగని రేషన్‌ బియ్యం అక్రమ రవాణా  

ఈ–పాస్‌ అమలవుతున్నా సరే..

కొందరు డీలర్లు, లబ్ధిదారుల మధ్య నగదు ఒప్పందం  

దుకాణాలకు రాకుండానే దారి మళ్లుతున్న వైనం

సాక్షి,సిటీబ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థకు కేటాయించిన పేదల బియ్యం పక్కదారి పడుతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు, పకడ్బందిగా రేషన్‌ సరుకులు పేదలకు చేరేందుకు ప్రభుత్వ చౌకధరల దుకాణల్లో ఈ–పాస్‌ (వేలిముద్ర) విధానం అమల్లోకి తెచ్చారు. సరుకులు డ్రా చేయకున్నా ‘రేషన్‌ కార్డు’ రద్దవదన్న వెసులు బాటుతో కొందరు లబ్ధిదారులు సరుకులకు దూరంగా ఉంటున్నారు. సరుకులు తీసుకోకుండే ఆ మేరకు స్టాక్‌ మిగిలినట్టు రికార్డు అవుతుంది. అయినప్పటికీ కొందరు దుకాణదారులు క్వింటాళ్ల కొద్దీ బియ్యం అక్రమంగా బయటికి తరలించేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో బియ్యం రూ.50కి పైగా ఉండగా.. సబ్సిడీ బియ్యం రూ.1కే దొరుకుతున్నాయి. దీంతో డీలర్లే సరుకులు తీసుకోని లబ్ధిదారుకుల కొంత మొత్తం ఆశ చూపి వారి బియ్యాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మధ్య తరగతి దూరమే..
గ్రేటర్‌లో సగానికి పైగా మధ్య తరగతి కుటుంబాలు ఆహార భద్రత కార్డుదారులు ఉన్నా రేషన్‌ బియ్యం తీసుకునేందుకు పెద్దగా ఆశక్తి చూపడం లేదు. కార్డు బహుళ ప్రయోజనకారిగా మాత్రమే వినియోగిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ఎంత మంది ఉంటే అన్ని కిలోల బియ్యం కేటాయిస్తోంది. అయితే, వీటిని లబ్ధిదారులు తీసుకోకపోవడంతో అవి డీలర్ల వద్దే ఉండిపోతున్నాయి. ఇలాంటివి మిగులుగా స్టాక్‌లో చూపించాలి. కానీ ఆహార భద్రత లబ్ధిదారుల్లో కొందరు బియ్యానికి బదులు నగదు తీసుకుంటున్నట్టు సమాచారం. డీలర్లు కిలో రూ. 10 చొప్పున లెక్క కట్టి లబ్ధిదారులకు ఇచ్చేస్తున్నారు. ప్రతినెలా రేషన్‌ షాపునకు వచ్చి ఈ–పాస్‌లో వేలిముద్ర ఇస్తే నగదు ఇచ్చేస్తామని లబ్ధిదారులకు ఆఫర్‌ ఇవ్వడం సర్వసాధారణమైంది. ఉదాహరణకు ఓ కుటుంబంలో భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు ఉంటే ఐదుగురికి ప్రతి నెలా 30 కిలోల బియ్యం కేటాయిస్తున్నారు. వాటిని డీలర్‌కు ఇచ్చేస్తే రూ.300 లబ్ధిదారులకు అందుతోంది. దాంతో రేషన్‌ బియ్యం తినని లబ్ధిదారులు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. 

దుకాణాలకు రాకుండానే..
ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా లెవీ కింద రైస్‌ మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేస్తోంది. ఎఫ్‌సీఐ నుంచి స్టేజ్‌–1 గుత్తేదారులు ద్వారా సివిల్‌ సప్లయిస్‌ గోదాములకు, అక్కడి నుంచి స్టేజ్‌–2 గుత్తేదారుల ద్వారా చౌకధరల దుకాణాలకు అందిస్తున్నారు. బియ్యం చేరవేసే క్రమంలో డీలర్లే రెగ్యులర్‌ ఒప్పంద లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఆమేరకు బియ్యాన్ని దారి మళ్లిస్తున్నట్టు అధికారులు తేల్చారు.

మరిన్ని వార్తలు