ఐరిస్‌తోనూ ‘రేషన్‌’

18 Jan, 2019 09:57 IST|Sakshi
ఐరిస్‌ తీసుకుంటున్న అధికారులు (ఫైల్‌)

గ్రేటర్‌ అధికారుల కసరత్తు  త్వరలో అందుబాటులోకి... 

బయోమెట్రిక్‌లో సమస్యల నేపథ్యంలోనే..

సాక్షి, సిటీబ్యూరో: ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్న రేషన్‌ సరుకులను ఇక నుంచి బయోమెట్రిక్‌(వేలిముద్రలు)తో పాటు ఐరిస్‌(కళ్ల గుర్తింపు)తోనూ ఇవ్వనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. తొలి విడతలో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో ఈపోస్‌ (బయోమెట్రిక్‌) విధానం ద్వారా సరుకుల పంపిణీ కొనసాగుతోంది. అయితే ఈ విధానంలో కొంతమందికి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళల వేలిముద్రలు చెరిగిపోవడంతో ఈపోస్‌ మెషిన్‌లు గుర్తించడం లేదు. దీంతో ప్రతినెల రేషన్‌ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. తిరిగి వేలిముద్రలు సరిచేసుకునేందుకు ఆధార్‌ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అయినప్పటికీ గృహిణులు, ఇతరాత్ర పనులు చేసుకునేవారి వేలిముద్రలను ఈపోస్‌ గుర్తించడం సమస్యగా తయారైంది. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో లబ్ధిదారులు అసౌకర్యానికి గురికావద్దనే ఉద్దేశంతో వేలిముద్రలు సరిపోలని చోట ఆయా ప్రాంతాల్లోని పౌరసరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్లకు అథంటికేషన్‌ సౌకర్యం కల్పించారు. అయితే ఈ విధానం కొన్నిచోట్ల దుర్వినియోగమవుతున్న విషయం పౌరసరఫరాల అధికారుల పరిశీలనలో వెల్లడైంది.  

11.09 లక్షల కుటుంబాలు..
గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా అర్బన్‌ పరిధులు ఉన్నాయి. పౌరసరఫరాల శాఖకు మొత్తం 12 సర్కిళ్లకు గాను హైదరాబాద్‌ పరిధిలో 9 సర్కిల్స్, మేడ్చల్‌ జిల్లా అర్బన్‌ పరిధిలో 2, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక సర్కిల్‌ ఉన్నాయి. మొత్తం మీద ఆహార భద్రత (రేషన్‌) కార్డు కలిగిన సుమారు 11.09 లక్షల కుటుంబాలు ఉండగా సుమారు 40లక్షల వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 12లక్షలకు పైగా వృద్ధులు, మహిళలు ఉన్నారు. ఇందులో 30శాతం వరకు లబ్ధిదారులకు బయోమెట్రిక్‌ సమస్య ఉంది. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారంగా పౌరసరఫరాల శాఖ ఐరిస్‌ విధానానికి శ్రీకారం చుడుతోంది.

మరిన్ని వార్తలు