‘సగం’ మందికి చేరిన బియ్యం 

6 Apr, 2020 02:35 IST|Sakshi

ఐదు రోజుల్లోనే 1.40 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్‌ సరఫరా

1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర పూర్తయిన బియ్యం పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ బియ్యం పంపిణీ వేగంగా జరుగుతోంది. గడిచిన రెండు మూడు రోజులుగా సర్వర్‌ సమస్యల కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తగా, ఆదివారానికి సమస్య కొలిక్కి రావడంతో పంపిణీ కార్యక్రమం సజావుగా కొనసాగింది. శనివారం ఒక్క రోజే గరిష్టంగా 10.04 లక్షల మంది కార్డుదారులు రేషన్‌ బియ్యాన్ని తీసుకోగా ఆదివారం మధ్యాహ్నానికి 6.50 లక్షల మంది రేషన్‌ తీసుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 87.59 లక్షల కుటుంబాల్లో 2.80 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 45.11 లక్షల కుటుంబాల్లో 1.60 కోట్ల మంది 1.67 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. నిజానికి సాధారణ రోజుల్లో ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున నెలకు 1.57 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని శాఖ పంపిణీ చేస్తుంటారు. ఈ ప్రక్రియ ప్రతి నెలా 15 రోజుల పాటు కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా ఇప్పటికే నెల కోటాను దాటి 1.67 లక్షల మెట్రిక్‌ టన్నుల పంపిణీని పూర్తి చేసింది. ఆదివారం సైతం చాలా రేషన్‌ దుకాణాల వద్ద జనం గుంపులుగా కనిపించినా డీలర్లు వేగంగానే పంపిణీ ప్రక్రియ పూర్తి చేశారు.

15 తర్వాత కిలో కందిపప్పు.. 
కేంద్ర ప్రభుత్వం సైతం రేషన్‌ లబ్ధిదారులకు కిలో కందిపప్పు ఇచ్చేందుకు సమ్మతించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 87.59 లక్షల కుటుంబాలకు కిలో చొప్పున మొత్తంగా 26,685 మెట్రిక్‌ టన్నుల మేర కందిపప్పు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కందిపప్పును కేంద్ర సంస్థ అయిన నాఫెడ్‌.. పౌర సరఫరాల సంస్థకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మరో వారం పది రోజుల్లో పూర్తవగానే ఈ నెల 15 తర్వాత నుంచి కందిపప్పును పంపిణీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు