రవళి పరిస్థితి విషమం

2 Mar, 2019 11:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రవళి ఆరోగ్యం విషమంగా ఉందని ... గత నాలుగు రోజులుగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. పెట్రోల్ మంటల్లో శ్వాసనాళాలు కాలిపోవడంతో శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో రవళి ఉండటంతో.. వెంటిలేషన్ సహాయంతో కృత్తిమ శ్వాస అందిస్తున్నామన్నారు.  కళ్లు దెబ్బతినడంతో చూపు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతo ఆమె ​కోలుకోవడం కష్టమేనని వైద్యులు అంటున్నారు.

రవళి, సాయి అన్వేష్ సంగెం మండలం లోహితలోని కాకతీయ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలో వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. వీరిమధ్య కొనసాగిన ప్రేమ డిగ్రీలోకి వచ్చిన తర్వాత క్రమంగా తగ్గడం మొదలైంది. దీంతో రవళిపై అన్వేష్‌ కోపం పెంచుకున్నాడు. ప్రేమను కొనసాగించాల్సిందేనంటూ రవళిపై ఒత్తిడి తెచ్చాడు. చాలా సార్లు బెదిరించాడు కూడా. అన్వేష్‌ వేధింపులు ఎక్కువవడంతో.. రెండు నెలల క్రితం ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది.

దీంతో రవళి తల్లిదండ్రులు సాయి అన్వేష్‌ తల్లిదండ్రులకు చెప్పి.. వారి గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో అన్వేష్‌ను హెచ్చరించారు. దీంతో తాను ఇకపై రవళి జోలికి వెళ్లనంటూ అన్వేష్‌ లిఖితపూర్వకంగా మాటిచ్చాడు. అయితే తన ఊర్లో పరువు తీసిందనే కారణంతో.. కక్ష పెంచుకున్న అన్వేష్‌.. ఫిబ్రవరి 27న కళాశాల సమీపంలో పెట్రోల్‌తో మాటువేసి దారుణానికి పాల్పడ్డాడు.

చదవండి :

యశోద ఆసుపత్రికి రవళి

వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్‌ దాడి

పేట్రేగిన ప్రేమోన్మాదం

మరిన్ని వార్తలు