టీవీ9 షేర్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు : అలందా

11 Jun, 2019 20:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ9 కొనేందుకు హవాలా డబ్బును వాడారన్న ఆ చానెల్‌ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఆరోపణలను అలందా మీడియా తీవ్రంగా ఖండించింది. నిబంధనల ప్రకారమే టీవీ9 షేర్లను కొనుగోలు చేశామని సృష్టం చేసింది. కేసును తప్పుదోవ పట్టించేందుకే రవిప్రకాశ్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు మంగళవారం అలందా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. టీవీ9 షేర్లను పూర్తిగా బ్యాంకు రూపంలోనే కొనుగోలు చేశామని, ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వలేదని పేర్కొంది. షేర్ల కొనుగోలుకు హవాల డబ్బు వాడారన్న రవిప్రకాశ్‌ ఆరోపణలు అవాస్తవాలని, కేసు నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపింది.

కాగా టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్‌ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల అక్రమ నిధులు వచ్చాయని రవిప్రకాశ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. టీవీ 9లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు సమకూర్చారని ఆయన ఆరోపించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులను అందజేసే మార్గాల్లో ఈ నిధులను తరలించారని సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని రవిప్రకాశ్‌ ఆరోపించారు. 

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. నేటికి వాయిదా వేశారు. నేడు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు