పోరుబాట వీడిన చంబాల రవీందర్

2 Aug, 2014 03:29 IST|Sakshi
పోరుబాట వీడిన చంబాల రవీందర్
  •       డీజీపీ ఎదుట లొంగుబాటు
  •      24 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి తెర
  •      అనారోగ్యంతోనే బయటికి..
  •      కుటుంబ సభ్యుల్లో వెల్లివిరిసిన ఆనందం
  • జఫర్‌గఢ్/వరంగల్‌క్రైం : సుదీర్ఘ కాలంగా విప్లవోద్యమంలో పని చేస్తున్న జిల్లాకు చెంది న ప్రముఖ మావోయిస్టు నేత కుక్కల రవీందర్ అలియూస్ చంబాల రవీందర్ తన భార్యతో సహ పోలీసుల ఎదుట శుక్రవారం లొంగిపోయూరు. కుమారుడి లొంగుబాటు గురించి తెలియగానే ఆయన తల్లి, సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో రవీందర్ లొంగిపోయినట్లు తెలిసింది. మండలంలోని తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన చంబాల సాయిలు, నర్సమ్మ దంపతులకు నలుగురు కుమారులు. అందరిలో చిన్నవాడైన రవీందర్ ఇదే మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు.

    అనంతరం గ్రామంలోని ప్రాథమిక సహకార సొసైటీలో వాచ్‌మన్‌గా ఏడాదిపాటు పని చేశాడు. ఈ క్రమంలో అతడికి వివాహమైంది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఆయన  పీపుల్స్‌వార్‌లో పనిచేస్తున్నట్లు తెలియడంతో వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. రెండు నెలలు జైలులో ఉండి ఇంటికి వచ్చిన ఆయనపై గ్రామస్తులు పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో విసుగు చెంది 1990లో అజ్ఞాతంలోకి వెళ్లాడు.

    ఆయన తిరిగి రాకపోవడంతో నాలుగేళ్ల తర్వాత భార్య విడాకులు ఇచ్చి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత తిరిగి ఆయన ఒక్కసారి కూడా ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన రవీందర్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఆంధ్రా- ఒరిస్సా బార్డర్‌లో స్పెషల్ జోనల్ కమిటీ ప్రొటెక్షన్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనపై ప్రభుత్వం రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది.
     
    ఆలస్యంగా పోలీస్ రికార్డుల్లోకి..
     
    రవీందర్ అజ్ఞాతంలోకి వెళ్లిన కొన్నేళ్ల తర్వాత పోలీసులు ఈ విషయూన్ని గుర్తించారు. అతడు అజ్ఞాతంలో ఉన్నట్లు అక్టోబర్ 29, 1998లో పోలీస్ రికార్డుల్లో నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు తరచూ తమ్మడపల్లి(ఐ) గ్రామానికి వెళ్లి రవీందర్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులను శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్లకు గురిచేశారు. ఈ బాధ భరించలేక అతడి సోదరులు కొన్నేళ్లపాటు ఊరు విడిచి వెళ్లారు. కుటుంబ సభ్యులను పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రవీం దర్ మాత్రం లొంగిపోలేదు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇల్లు శిథిలవస్థకు చేరుకుని, చుట్టూ ముళ్ల కంపలు పెరిగాయి. ప్రస్తుతం రవీందర్ పెద్ద అన్న గ్రామంలోనే మరో ఇల్లు నిర్మించుకొని తల్లితో కలిసి నివసిస్తున్నాడు.
     
    తమ్మడపల్లి(ఐ)లో హర్షాతిరేకాలు..
     
    రవీందర్ లొంగిపోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు రడపాక ఎల్లయ్య, మునిగల సామేల్ మాట్లాడుతూ పోలీసులు ఎలాంటి కేసులు పెట్టకుండా ప్రశాంతంగా గ్రామంలో జీవించేలా చూడాలని కోరారు.
     
     

మరిన్ని వార్తలు