రామ రామ రామ ఉయ్యాలో.. 

14 Oct, 2018 01:35 IST|Sakshi
రవీంద్రభారతిలో జరిగిన బతుకమ్మ వేడుక

తీరొక్క పూలతో.. తీరైన బతుకమ్మలతో 

రవీంద్ర భారతి వేదికగా బతుకమ్మ సంబురాలు  

21 దేశాలకు చెందిన 75 మంది హాజరు

సాక్షి, హైదరాబాద్‌: రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం హోరెత్తింది. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా భావించే ఈ పండుగను విదేశీయులు సైతం అమితంగా ఇష్టపడుతున్నారు. శనివారం రవీంద్రభారతి వేదికగా విదేశీయులు బతుకమ్మ ఆడా రు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాహిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విద్యాల యం గచ్చిబౌలి వారు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఆకర్షణీయమైన దుస్తులు దరించిన విదేశీయులు కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.

ఇండోనేసియా, మలేసియా, రష్యా, అమెరికా, దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, రష్యా తదితర 21 దేశాలకు చెందిన 75 మంది బ్రహ్మకుమారీ మహిళలు, పురుషులు ఇందులో పాల్గొన్నారు. వీరంతా దాదాపు రెండు నెలలపాటు బతుకమ్మ ఆటపాటలపై శిక్షణ తీసుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, అకాడమీ ఫర్‌ ఏ బెటర్‌ వరల్డ్‌ డైరెక్టర్‌ బ్రహ్మకుమారీ కులదీప్‌ సిస్టర్, రష్యాలో బ్రహ్మకుమారీస్‌ డైరెక్టర్‌ సంతోష్‌ సిస్టర్, రజనీ సిస్టర్, జస్టిస్‌ ఈశ్వర య్య, జస్టిస్‌ అమర్‌నాథ్, జస్టిస్‌ రమేశ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, బీఎం రెడ్డి పాల్గొన్నారు.  

ఒక్క పండుగతో వంద లాభాలు.. 
ప్రపంచంలో ఇలాంటి పండుగ ఎక్కడా చూడలేదు. ప్రకృతి, వైద్యం, వ్యాయామం, సమైక్య త, సమగ్రత వంటి ఎన్నో అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ఆచార, వ్యవహారాలు  తెలియచేసేది బతుకమ్మ పండుగ.  
–బ్రహ్మకుమారీ కులదీప్‌ సిస్టర్‌

బతుకమ్మ విశ్వవ్యాప్తం అవుతుంది.. 
మేం ఎక్కడా ఇలాంటి సంబరాలు చూడలేదు. ప్రకృతిలో వికసించే పూలతో అందంగా బతుకమ్మను పేర్చి ఆడటం వల్ల మనస్సు వికసిస్తోం ది. భవిష్యత్‌లో ఈ పండుగ విశ్వవ్యాప్తం అవుతుంది. బతుకమ్మ ఆటపాటను తమ దేశంలో కూడా ఆడతామని ముందుకు వస్తున్నారు.  
– సంతోష్‌ సిస్టర్‌  

ఏకాగ్రత పెరుగుతుంది.. 
పెద్దలు, పిల్లలతో కలిసి బతుకమ్మ ఆడటం వల్ల అందరి మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. తిరుగుతూ ఆడటంతో ఏకాగ్రత పెరు గుతుంది. ప్రకృతితో మమేకమవుతూ మహిళలు పేర్చే బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ పండుగను ఇక ముందు రష్యాలో కూడా కొనసాగిస్తాం.  
– నాగమన్జ్, థాయ్‌లాండ్‌ 

బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశాం.. 
బ్రహ్మకుమారీస్‌ 130 దేశాల్లో ఉన్నారు. మూడేళ్లుగా వారితో బతుకమ్మ సంబరాలు చేయిస్తున్నాం. ఈసారి 21 దేశాల కళాకారులు వచ్చారు. 25 దేశాలతో ఎంవోయూకు సిద్ధంగా ఉన్నాం.  బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయటమే లక్ష్యం.  ప్రపంచ పర్యాటకులు అంతా తెలంగాణ వైపు రావాలి. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు తిలకించి వెళ్లాలి.                  
 – బుర్రా వెంకటేశం

మరిన్ని వార్తలు