ఆర్టీసీ సమ్మెకు సీపీఎం పూర్తి మద్దతు: తమ్మినేని

9 Oct, 2019 13:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎయిర్‌బస్‌పై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదని విమర్శించారు. ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ సినిమా చూసిస్తున్నారని మండి పడ్డారు. సీఎం ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 1200 మంది ఉద్యోగులే ఉన్నారన్న కేసీఆర్‌ ప్రకటన రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తే.. కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్తామని.. కర్రు కాల్చి వాత పెట్టే సందర్భం వస్తుందని రావుల హెచ్చరించారు.

ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు: తమ్మినేని
ఆర్టీసీ సమ్మెకు సీపీఎం పూర్తి మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశానికి హాజరైన తమ్మినేని ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌కు పాలేర్లు కాదని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె నూటికి నూరు శాతం జయప్రదమవుతున్న సమ్మె అని స్పష్టం చేశారు. సమ్మెకు మద్దతు తెలపడానికి టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు రావడానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్‌ మాటలు ఆయన అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మండి పడ్డారు.

మరిన్ని వార్తలు