‘టికెట్లతో కొప్పుల రాజుకు సంబంధం లేదు’

13 Aug, 2019 19:44 IST|Sakshi

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి కుంతియా

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపుల్లో ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజుకు ప్రమేయం లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జి ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. పీసీసీ, ఎల్.ఓ.పి, ఇంచార్జి కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆలోచించే టిక్కెట్లు కేటాయించామని తెలిపారు. వాటితో కొప్పుల రాజుకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. తమకు టికెట్‌ ఇవ్వకుండా రాజు అడ్డుకున్నారనే కొంతమంది వాదనల్లో నిజం లేదని తేల్చిచెప్పారు.

పార్టీ నాయకులెవరైనా తమ ఫిర్యాదులను పీసీసీ, ఏఐసీసీకి దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, పత్రికలకు ఎక్కి ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. కొప్పుల రాజు సిన్సియర్‌గా పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆయనకు తెలంగాణ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజు వల్లనే రాహుల్ గాంధీని కలవలేక పోతున్నామనే కొందరు నేతల ఆరోపణల్ని సైతం కుంతియా కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌తో కొప్పులరాజుకు ఏం సబంధమని ప్రశ్నించారు. అది పూర్తిగా రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి చూసుకుంటారని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్‌ నాయకులు పత్రికలకి ఎక్కి ఆరోపణలు చేయకుండా సమస్యలేవైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికపై మాట్లాడాలని సూచించారు.

మరిన్ని వార్తలు