కుల, మతాల మధ్య చిచ్చు

8 Dec, 2017 02:55 IST|Sakshi

కేసీఆర్, మోదీలపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ధ్వజం

రాహుల్‌ ప్రభంజనంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ గల్లంతు ఖాయం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి తమాషా చూస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా ఆరోపించారు. ఖమ్మం అర్బన్‌ మండలం చింతగుర్తిలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయితం సత్యం అధ్యక్షతన గురువారం రాత్రి నిర్వహించిన ప్రజా చైతన్య సభలో కుంతియా మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆదుకోవాల్సిన కేసీఆర్‌ ప్రభుత్వం వారి ఆకాంక్షలు, ఆశలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, అయితే ఈ చిచ్చు వారికే అంటుకోవడం ఖాయమన్నారు. గిట్టుబాటు ధర అడిగిన రైతులను దేశ ద్రోహుల మాదిరిగా బేడీలు వేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావించి సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రకటిస్తే.. అందుకు భిన్నంగా కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాహుల్‌ గాంధీ ప్రభంజనంలో వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గాలికి కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, దేశంలో మోడీ శకం ముగిసినట్లేనన్నారు. గుజరాత్‌ ప్రజల తీర్పు ముందే ఊహించిన మోదీ పదిరోజుల నుంచి ఒక ప్రకటన సైతం చేయలేని దుస్థితి నెలకొందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తోందనడానికి ఇది ఉదాహరణగా పేర్కొన్నారు.  

నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి: ఉత్తమ్‌
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడక తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగ యువత ఇప్పుడు తీవ్ర నిరాశ, నైరాశ్యంతో కొట్టు మిట్టాడుతోందన్నారు. కొలువులు అడిగిన నిరుద్యోగ యువకులను కేసీఆర్‌ ప్రభుత్వం జైళ్లలో వేస్తోందని, ఇంతటి నిరంకుశ పాలన గతంలో లేదన్నారు. రాష్ట్రంలో 2014 నాటికి 1,07,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే.. కేసీఆర్‌ ప్రభుత్వం కనీసం 7 వేల ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేని దుస్థితిలో ఉందన్నారు. ఇక తెలంగాణ తెచ్చుకున్న ప్రయోజనం ఏముంటుందో.. నిరుద్యోగులకు ఉపశమనం ఎలా కలుగుతుందో కేసీఆర్‌ ప్రభుత్వమే సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బలహీన, బడుగు వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా.. లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు  నిరుద్యోగ భృతిగా అందిస్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఒకేసారి రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని సీతారామసాగర్‌ ప్రాజెక్టు అంచనా విలువలను పదింతలు చేసి కాంట్రాక్టర్లు, ప్రభుత్వం ప్రజల సొమ్మును దండుకుంటున్నాయని విమర్శించారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సభలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మాజీ మంత్రి బలరాంనాయక్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, శాసనమండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మానుకొండ రాధాకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు