నెలాఖరులోనే పట్టాభిషేకం!

14 Mar, 2015 00:18 IST|Sakshi

సగం దరఖాస్తులు బుట్టదాఖలు..
క్రమబద్ధీకరణకు పేదలు దూరం
ఆర్డీఓల స్థాయిలో భారీగా తిరస్కరణ
10వేలు పరిశీలిస్తే ఐదు వేలకే మోక్షం
అనుమానాలకు తావిస్తున్న అధికారుల తీరు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. 125 గజాల్లోపు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న బీపీఎల్ (దారిద్య్రరేఖకు దిగువ) కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం.. అంటే ఈ నెలాఖరులో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. జీఓ 58 కింద జిల్లావ్యాప్తంగా 1,43,805 దరఖాస్తులు రాగా, దీంట్లో అభ్యంతరకరమైనవిగా లెక్కగట్టిన 48,105 దరఖాస్తులను ప్రాథమిక స్థాయిలోనే పక్కనపెట్టింది. మిగతా వాటిలో ఇప్పటివరకు 70,975 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం 35,369 క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయని తే ల్చింది. పరిస్థితిని చూస్తే జిల్లాలో 12వేల మందికి కూడా క్రమబద్ధీకరణ భాగ్యం కలిగే అవకాశంలేదని రెవెన్యూవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
 
శిఖం, నాలా, కోర్టుకేసులు, రోడ్డు పక్కన, భూదాన్ భూముల్లో వెలిసిన నిర్మాణాలను క్రమబద్ధీకరించకూడదనే ప్రభుత్వ నిర్ణయం మేరకు 48,105 దరఖాస్తులను రెవెన్యూ అధికారులు తోసిపుచ్చారు. మిగతావాటిని కూడా వడపోసి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఈ క్రమంలో దాదాపు లక్ష దరఖాస్తులకు మోక్షం కలగలేదు. ఇప్పటివరకు పరిశీలించినదాంట్లో కేవలం 35వేలు మాత్రమే అర్హమైనవిగా తేలుస్తూ ఆర్డీఓలకు సిఫార్సు చేశారు.

తాజాగా వీటిలో కూడా చాలావరకు తిరస్కరణకు గురవుతుండడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ అనుమానాలకు తావిస్తోంది.
 ప్రభుత్వ నియామవళి (చెక్‌లిస్ట్)కి అనుగుణంగా  క్షేత్రస్థాయిలో పరిశీంచి అర్హులను ఎంపిక చేశామని, ఇప్పుడు ఆర్డీఓలు ఏకపక్షంగా వాటిని తొలగించడం చూస్తే తమ చిత్తశుద్ధిని శంకించినట్లేననే ఓ డిప్యూటీ తహసీల్దార్ ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా, విలువైన ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ రూపంలో పరాధీనం కావడం సరికాదనే ఉద్ధేశంతోనే ఈ రెగ్యులరైజేషన్ వ్యవహారంలో అధికారులు కచ్చితత్వం పాటిస్తున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు