నాలుగు సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు?

7 Jun, 2018 01:18 IST|Sakshi

     త్వరలో నిర్వహించే యోచనలో ఓయూ యంత్రాంగం 

     జవాబు పత్రాల దగ్ధంపై విద్యార్థుల్లో ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా దగ్ధమైన జవాబు పత్రాలకు సంబంధించిన సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని వర్సిటీ పాలక వ ర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. బీఎస్సీ సెకండ్‌ ఇయర్‌ జువాలజీ, మ్యాథమెటిక్స్‌ సహా మరో 2 సబ్జెక్టుల జవాబు పత్రాలు దగ్ధమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు ప్రొ.శివరాజ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన బృందం బుధవారం షార్ట్‌సర్క్యూట్‌ జరిగిన గదిని పరిశీలించింది.

అగ్నికి దగ్ధమైన పేపర్ల, ఫైర్‌ ఇంజన్‌ వదిలిన నీటి ద్వారానే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు గుర్తించింది. కాలిపోయిన వాటిలో బీఎస్సీ సెకండియర్‌ సెమిస్టర్‌ జవాబు పత్రాలే ఉండటం అధికారులకు ఊరట కలిగించే అంశమే అయినా.. ఇప్పటికే ఒకసారి పరీక్ష రాసినవారు మరోసారి రాయాల్సి రావడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీసి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  

ఏళ్లుగా కేబుళ్లు మార్చకపోవడంతోనే..
ఓయూ పరిపాలనా భవనం సహా కాలేజీ, హాస్టల్‌ భవనాలన్నీ ఏళ్ల క్రితం నిర్మించినవే. ఆయా భవనాల్లో అప్పటి అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌లైన్లను ఏర్పాటు చేశా రు. ఫ్యాన్లు, లైట్ల సామర్థ్యానికి సరిపడే కేబు ళ్లు మాత్రమే వేశారు. ఆ తర్వాత కూలర్లు, ఏసీలు, కంప్యూటర్లు వచ్చి చేరాయి. పెరిగిన విద్యుత్‌ వినియోగానికి తగ్గట్టు కేబుళ్ల సామర్థ్యం పెంచాల్సి ఉన్నా.. చర్యలు చేపట్టలేదు. దీంతో షార్ట్‌సర్క్యూట్‌లు చోటుచేసు కుంటున్నాయి. శతాబ్ది ఉత్సవాల సమయం లో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. వీటిని భవనాల పునరుద్ధరణకు కాకుండా ఇతర అవసరాలకు వాడారు. 

కమిటీ రిపోర్టు మేరకే నిర్ణయం
ఈ అగ్నిప్రమాదంపై కమిటీ విచారణ చేపట్టింది. గురువారం కల్లా నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఏఏ సబ్జెక్టుల జవాబు పత్రాలు కాలిపోయాయి? ఎన్ని కాలిపోయాయి? వంటి వివరాలు తెలుస్తాయి. కమిటీ ఇచ్చే రిపోర్టు మేరకు మళ్లీ పరీక్షలు నిర్వహించే అంశాన్ని ఆలోచిస్తాం.
– వీసీ, ప్రొఫెసర్‌ రామచంద్రం 

మరిన్ని వార్తలు