లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం 

3 Aug, 2019 01:48 IST|Sakshi
ప్రజాసంఘాల ప్రతినిధులను పోలీస్‌ వ్యాన్‌ ఎక్కిస్తున్న దృశ్యం

గాంధీ ఆస్పత్రికి చేరుకున్న ప్రజా సంఘాల నేతలు

అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

పలువురి అరెస్టు.. మృతదేహం స్వస్థలానికి తరలింపు  

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి మార్చురీలో సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రీజనల్‌ కార్యదర్శి లింగయ్య మృతదేహానికి శుక్రవారం రీపోస్టుమార్టం నిర్వహించారు. గత నెల 31న లింగయ్యను పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారంటూ ఆరోపిస్తూ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ అత్యవసర ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడంతో లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి విదితమే. ఈ మేరకు శుక్రవారం వేకువ జామున 3 గంటలకు లింగయ్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ పర్యవేక్షణలో ముగ్గురు ఫోరెన్సిక్‌ వైద్యులు సుమారు మూడు గంటల పాటు లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈ సమాచారం తెలుసుకున్న పలు ప్రజా సంఘాల ప్రతినిధులు గాంధీ మార్చురీ వద్దకు చేరుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్‌వార్‌ నేతృత్వంలో గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజుల ఆధ్వర్యంలో పోలీసులు ఆస్పత్రి ప్రాంగణంలో భారీగా మోహరించారు. మీడియాను గాంధీ మార్చురీలోకి అనుమతించలేదు. పలు ప్రజాసంఘాల ప్రతినిధులు మార్చురీ వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్‌ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు.  

పోలీసులపై విమలక్క, సంధ్య ఆగ్రహం 
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఐద్వా నేత సంధ్య పోలీసుల కళ్లు గప్పి రోగుల మాదిరిగా ఆటోల్లో ఆస్పత్రిలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి మార్చురీ వద్దకు వెళ్తున్న క్రమం లో గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  లింగయ్య మృతదేహాన్ని కడసారి చూసేందుకు అనుమతించకపోవడంతో పోలీసుల చర్యపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం అనంతరం లింగయ్య మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలానికి తరలించారు. 17 మంది ఆందోళనకారులను అరెస్ట్‌ చేసినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు. 

విమలక్క, సంధ్య అరెస్టు అన్యాయం: రేణుకాచౌదరి 
లింగయ్య ఎన్‌కౌంటర్‌ సందర్భంగా శవాన్ని రీ–పోస్టుమార్టం చేస్తున్న ప్రాంతానికి వెళ్లిన అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్యలను అరెస్టు చేయడం అన్యాయమని మాజీ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని, అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. సామాజిక ఉద్యమకారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పోలీసు కాల్పుల పేరుతో ప్రాణాలను పొట్టన పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో రేణుక పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు