ఔటర్‌కు ‘అధికార’గ్రహణం

4 Jul, 2014 02:36 IST|Sakshi
ఔటర్‌కు ‘అధికార’గ్రహణం

* కాంట్రాక్టు సంస్థకు ఉద్దేశపూర్వకంగా ఉద్వాసన
* అధికారుల నిర్వాకానికి యూజీసీసీ బలిపశువు
* ఉన్నతాధికారి కనుసన్నల్లో తాజాగా రీటెండర్లు
* ఆమ్యామ్యాల కోసమే అడ్డగోలు నిర్ణయం!
* ఫలితంగా హెచ్‌ఎండీఏపై రూ.100 కోట్ల భారం
* రింగ్‌రోడ్డు నిర్మాణమూ మరో రెండేళ్లు ఆలస్యం!
 
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టుకు కొందరు ఉన్నతాధికారుల తీరు శాపమౌతోంది. ఇప్పటికే యాభై శాతానికి పైగా పనులు పూర్తి చేసిన ఓ కాంట్రాక్టు సంస్థకు ఏకపక్షంగా ఉద్వాసన పలికి రీటెండర్‌కు వెళ్లాలని నిర్ణయించడం చర్చనీయంగా మారింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్)లో శామీర్‌పేట్-కీసర రీచ్ పనుల విషయంలో ఉన్నతాధికారి ఒకరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం హెచ్‌ఎండీఏపై ఏకంగా రూ.100 కోట్ల ఆర్థిక భారానికి కారణమవుతోంది. పైగా ఏడాదిలోగా పూర్తయ్యే అవకాశమున్న ఓఆర్‌ఆర్ పనులు ఈ నిర్ణయం వల్ల మరో రెండేళ్లయినా ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

రీటెండర్‌పై అనుమానాలెన్నో!
ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా శామీర్‌పేట్-కీసర రీచ్ పనులను రూ.195 కోట్లతో యునెటైడ్ గల్ఫ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (యూజీసీసీ) దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 30 నెలల్లో (నవంబర్ 2012 నాటికి) పనులు పూర్తి చేయాలి. ఈ మార్గంలో మొత్తం 10.3 కి.మీ. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని 12 నెలల్లోగా కాంట్రాక్టు సంస్థకు అప్పగించాల్సి ఉంది. ఔటర్ అధికారుల నిర్వాకం వల్ల నిర్దేశిత 30 నెలల గడువు ముగిసే నాటికి కూడా పూర్తిస్థాయిలో భూమిని అప్పగించలేకపోయారు. దాంతో గడువులోగా నిర్మాణం పూర్తవలేదు. అధికారులు మాత్రం తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకొనేందుకు నెపాన్ని కాంట్రాక్టు సంస్థపైకి నెట్టేశారు.

పనుల్లో జాప్యానికి కాంట్రాక్టరే కారణమంటూ ఆ సంస్థను టెర్మినేట్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఔటర్ పనులపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తుందన్న భయంతో శామీర్‌పేట-కీసర మార్గంలో నిలిచిపోయిన పనులకు రీ టెండర్ పిలిచేందుకు ఆత్రుత పడుతున్నారు. అందుకోసం హడావుడిగా అంచనాలు కూడా రూపొందించారు. మిగిలిపోయిన పనులకు పాత టెండర్ ప్రకారం రూ.100 కోట్లు ఖర్చవనుండగా తాజా అంచనాల మేరకు వాటికి ఏకంగా రూ.190 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది.

పైగా మళ్లీ టెండర్ పిలిచి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేయడానికి 3 నెలలు, ఆ తర్వాత పనులు ప్రారంభించేందుకు (మొబిలైజేషన్‌కు) 2 నెలలు, నిర్మాణ పనులు పూర్తి చేయడానికి మరో 15 నెలలు... వెరసి ప్రాజెక్టు గడువును రెండేళ్లకు పైగా పొడిగించడం తప్పనిసరి. అంటే ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం మొత్తం 158 కి.మీ. పూర్తైఅందుబాటులోకి వచ్చేది 2016 జనవరి తర్వాతేనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
 
చేతివాటానికేనా..?
ఒప్పందం ప్రకారం పనులను పూర్తి చేసేందుకు పాత కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నా హెచ్‌జీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు ఉద్దేశపూర్వకంగానే ఆ సంస్థను పక్కకు పెట్టినట్టు హెచ్‌ఎండీఏలో గుసగుసలు విన్పిస్తున్నాయి. మళ్లీ టెండర్ పిలిస్తే తమకు అంతో ఇంతో గిట్టుబాటవుతుందని భావిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీ టెండర్ వల్ల హెచ్‌ఎండీఏపై అనవసరంగా రూ.100 కోట్ల భారం పడటమే గాక ప్రాజెక్టు మరో రెండేళ్లయినా ఆలస్యమవుతుందని హెచ్‌జీసీఎల్‌లోని పలువురు అధికారులు అంటున్నారు. ఈ దృష్ట్యా పాత కాంట్రాక్టర్‌తోనే పనులు కొనసాగించడం ఉత్తమమని బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ సదరు ఉన్నతాధికారి మాత్రం యూజీసీసీని తప్పించాల్సిందేనంటూ కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు వినికిడి.
 
అయినవారికి ఆకుల్లో...
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టులో కీలక స్థానంలో ఉన్న ఓ ఉన్నతాధికారి అయినవారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో సంస్థ విషయంలో ఆయన ఒక్కోలా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. శామీర్‌పేట్-కీసర మార్గంలోనే మరో రీచ్‌లో నిర్మాణ పనులు చేపట్టిన  ఓ కాంట్రాక్టు సంస్థకు నిర్దేశించిన గడువు ముగిసి 18 నెలలైనా సదరు అధికారి మాత్రం ఆ సంస్థపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తూ ఠంచనుగాబిల్లులతో పాటు అడ్వాన్స్‌లు కూడా చెల్లిస్తున్నారు! యునెటైడ్ గల్ఫ్ కంపెనీకి మాత్రం ఇంజనీరింగ్ అధికారులు సిఫార్సు చేసినా 2012 జూన్ నుంచి సకాలంలో బిల్లులు మంజూరు చేయలేదు. ప్రతి బిల్లుకూ మూడు నుంచి నాలుగు నెలలు ఆలస్యం చేశారు. దాంతో పనులు ఆలస్యమయ్యాయి.
 
 జాప్యానికి కారణాలివీ...
* కాంట్రాక్టర్‌కు భూమిని ఒకేసారి అప్పగించలేదు. ప్రాజెక్టు పరిపూర్తికి నిర్దేశించిన 30 నెలల గడువు ముగిశాక తీరిగ్గా అప్పగించారు.
 
* కాంట్రాక్టు ఒప్పందంలో చూపిన హార్డ్ రాక్ పరిమాణం సుమారు 15,000 క్యూబిక్ మీటర్లు కాగా అనంతరం అది ఏకంగా 1.52 లక్షల క్యూ.మీ. దాకా పెరిగింది. హార్డ్ రాక్ తొలగింపునకు క్యూబిక్ మీటర్‌కు రూ.564 చొప్పున చెల్లించాలన్నది ఒప్పందం. పెరిగిన క్వాంటిటీకి కాంట్రాక్టు నిబంధన ప్రకారం రేటు మార్చాలి. ఆ మేరకు క్యూ.మీ.కు రూ.565ను కాంట్రాక్టర్ కోట్ చేశారు. ఔటర్ అధికారులు మాత్రం ఎలాంటి ప్రాతిపదికా లేకుండా క్యూబిక్ మీటర్‌కు రూ.305 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ అడ్డగోలు నిర్ణయం వల్ల కాంట్రాక్టు సంస్థకు కేవలం హార్డ్ రాక్ తొలగింపులోనే సుమారు రూ.3 కోట్లు అదనంగా భారం పడింది. పైగా హార్డ్ రాక్‌ను తొలగించేందుకు నియంత్రిత విధానంలో బ్లాస్టింగ్ చేయాల్సి వచ్చింది. అందుకు ఏడాది పట్టడంతో ఆ మేరకు పనులు ఆలస్యమయ్యాయి.
 
* నిర్మాణ మార్గంలో లియోనియో క్లబ్ వద్ద హార్డ్ రాక్ తొలగింపునకు జలమండలికి చెందిన 250 ఎంఎం డయా వాటర్ పైప్‌లైన్ అడ్డొచ్చింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా దానిపై 5 నెలల పాటు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దాంతో పనులు ముందుకు సాగలేదు.
 
* ఇలా ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా ఎదురైన అవాంతరాలను ఓఆర్‌ఆర్ అధికారులకు కాంట్రాక్టర్ సకారణంగా వివరించి మరింత గడువు కోరినా వారు అలక్ష్యం చేశారు. ఫలితంగా నిర్దిష్ట గడువు మీరాక చేసిన పనులకు కాంట్రాక్టు సంస్థ న్యాయంగా పొందాల్సిన సుమారు రూ.3 కోట్ల ఎస్కలేషన్ మొత్తాన్ని పొందలేకపోయింది. పెపైచ్చు నెలకు రూ.50 లక్షల చొప్పున అదనపు భారాన్ని కూడా మోయాల్సి వచ్చింది.
 
* ఒప్పందంలో వివాదాల పరిష్కారానికి నిబంధనల మేరకు ‘డిస్ప్యూట్ రివ్యూ బోర్డు’ నియమించాలంటూ హెచ్‌జీసీఎల్ అధికారులకు కాంట్రాక్టర్ 2013 జూలైలో నోటీసిస్తే తీరిగ్గా 7 నెలల తర్వాత  2014 ఫిబ్రవరిలో బోర్డును వేశారు. కాంట్రాక్టర్ దాని దృష్టికి తీసుకెళ్లిన వివాదాలను పరిష్కరించేందుకు  2014 ఏప్రిల్ 2న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కానీ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఏమాత్రం ఖాతరు చేయకపోగా, అదే రోజు కాంట్రాక్టు సంస్థను తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు!

మరిన్ని వార్తలు