నేడే పురపోరు

30 Mar, 2014 01:47 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది....కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలలో ఆదివారం పోలింగ్ జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 97 వార్డుల్లో 143 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
 
ఎన్నికలు జరిగే రెండుమున్సిపాలిటీలు, రెండు నగరపంచాయతీలలో మొత్తం 97 వార్డుల్లో 523 మంది బరిలో నిలవడంతో అన్నిచోట్ల పోటీ తీవ్రంగానే ఉంది. నాలుగు చోట్ల 1,35,235 మంది ఓటర్లు ఉండగా ఇందులో  పురుషులు 66,176 మంది, మహిళలు  69,053 మంది ఉన్నారు. కొత్తగూడెంలో  అధికంగా 61,266 మంది, మధిరలో తక్కువగా 20,367 మంది ఓటర్లు ఉన్నారు.  కొత్తగూడెంలో 33 వార్డులకు 190 మంది, ఇల్లెందులో 24 వార్డులకు 173 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఇక్కడ గెలుపును అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి 166 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తరలించిన ఈవీఎంలు మొరాయిస్తే ప్రత్యామ్నాయంగా మరికొన్ని ఈవీఎంలను అందుబాటులో ఉంచుతూ అధికారులు చర్యలు తీసుకున్నారు.
 
నిఘా నీడలో..

పోలీస్ భారీ బందోబస్తు నడుమ ఈ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు గతంలో కన్నా ఈసారి భద్రతను పెంచారు. నాలుగు కేంద్రాల్లో మొత్తం 108 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో అన్నీ సమస్యాత్మక ప్రాంతాలే. వీటిలో 34 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
 
అలాగే ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 17 పోలింగ్ కేంద్రాలు, మధిర నగర పంచాయతీ పరిధిలో 8, సత్తుపల్లి నగర పంచాయతీలో 17 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి కట్టుదిట్టంగా భద్రతను నిర్వహిస్తున్నారు. 53 కేంద్రాల్లో  వెబ్, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 41 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. పోలింగ్ ప్రక్రియలో 796 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శనివారమే ఆయా మున్సిపాలిటీల పరిధిలో రిపోర్టు చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
 
ఓటరు తీర్పుపైనే ఆశలు..
వరుస ఎన్నికల నేపథ్యంలో ముందుగా జరుగుతున్న మున్సిపల్ తీర్పుపై రాజకీయపార్టీలన్నీ ఆశలుపెట్టుకున్నాయి. అభ్యర్థులు సైతం విజయం కోసం చివరి క్షణం వరకూ అన్ని యత్నాలూ చేస్తున్నారు.  ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గీత దాటకుండా.. పోలింగ్ కేంద్రానికి దూరంలో అభ్యర్థుల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ‘గుర్తు.. గుర్తుంచుకోండి..’ అంటూ చివరి అస్త్రాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ ఎన్నికల రణ రంగంలో ఓటరన్న చివరకు ఎవరికి పట్టం కడతారో ఫలితాల తర్వాతే తేలనుంది.

>
మరిన్ని వార్తలు