సమరమే..

17 Mar, 2014 00:02 IST|Sakshi
సమరమే..

‘స్థానిక’ పోరు షురూ
 46 జెడ్పీటీసీ, 685 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
 నేటినుంచి నామినేషన్ల స్వీకరణ
 సర్వం సిద్ధం చేసిన అధికారులు
 
 2,406 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
 పోటెత్తిన ఎన్నికలతో నాయకులు ఉక్కిరిబిక్కిరి
 కత్తిమీదసాములా మారిన అభ్యర్థుల ఎంపిక
 
 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్:స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేచింది. జిల్లాలోని 46 జెడ్పీటీసీ, 685 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల స్వీకరణ కోసం జిల్లా పరిషత్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
 
 జెడ్పీటీసీ నామినేషన్లను సంగారెడ్డిలోని జడ్పీ కార్యాలయంలో, ఎంపీటీసీ నామినేషన్లను మండల పరిషత్ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. ఎన్నికల తేదీ నిర్వహణపై సుప్రీం కోర్టు సోమవారం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చే నెల 6, 8 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
 
 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు(జెడ్పీటీసీ), మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల(ఎంపీటీసీ) ఎన్నికల కోసం 2,406 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 16,41,892 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 
 ఇదిలా ఉంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం వ్యవహరించనున్నారు. జిల్లా ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు హరిప్రీత్‌సింగ్, నీరబ్‌కుమార్ ప్రసాద్ నియామకమయ్యారు.
 
 
 నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు..
 సంగారెడ్డిలో 46 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం జెడ్పీ హాల్‌లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ డివిజన్‌ల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు 3 నుంచి 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
 
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ వేసే అభ్యర్థులు త ప్పనిసరిగా నామినేషన్ ఫారంతోపాటు విద్యార్హత, ఆస్తులు, అప్పులు, కుల ధ్రువీకరణ, నేరచరిత్ర ఉంటే అందుకు సంబంధించిన వివరా లు తెలియజేయాలి.ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థు లు విధిగా కుల ధ్రువీకరణ పత్రం జతచేయాలి.
 
 స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ ఫారంలో ప్రాధాన్యత వారీగా మూడు సింబల్స్ ఎంపిక చేసుకుని వాటిని రాయాలి. జెడ్పీటీసీ అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారై తే నామినేషన్ ఫారంతోపాటు రూ.2,500 సొ మ్ము డిపాజిట్ చేయాలి, జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి. ఎంపీటీసీ అభ్యర్థులు జనరల్ కేటగిరిలో పోటీ చేసే వారు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాల్సి ఉంటుంది.
 
 అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సామే..
 సాధారణ , మున్సిపల్ ఎన్నికలకు తోడు స్థాని క సంస్థల ఎన్నికలు రావటంతో రాజకీయ పా ర్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.  పార్టీలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక కత్తిమీ ద సాములా మారింది. ఆశావహుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా.. రాని వారు సాధారణ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారని అన్ని ప్రధాన రాజకీయపార్టీలు ఆందోళన చెందుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేవడంతో అన్ని పార్టీలు ప్రస్తుతం రేసు గుర్రాల వేటలో నిమగ్నమయ్యాయి.
 

మరిన్ని వార్తలు