ఖరీఫ్‌ సీజన్‌కు వరి విత్తనాలు సిద్ధం 

16 May, 2020 04:49 IST|Sakshi

67.78 లక్షల ఎకరాలకు 19.72 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

అందులో సగం కాటన్‌ దొర సన్నాలు, సాంబ మసూరీలే

రైతులకు అందుబాటులో ఉంచిన విత్తనాభివృద్ధి సంస్థ

సర్కారుకు సమగ్ర నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన వివిధ రకాల వరి విత్తనాలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. ఈ సీజన్‌కు ఎన్ని ఎకరాలకు, ఎన్ని వరి విత్తన రకాలను సిద్ధం చేశారన్న వివరాలను విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి శుక్రవారం నివేదించింది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో పెద్ద ఎత్తున వరి సాగు చేస్తారని సర్కారు అంచనా వేసిన నేపథ్యంలో ఆ మేరకు అన్ని రకాల విత్తనాలను ఆ సంస్థ అందుబాటులో ఉంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా వీటిని సమకూర్చినట్లు అధికారులు తెలిపారు.

67.78 లక్షల ఎకరాలకు సరిపోను..... 
రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో 67.78 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆ ప్రకారం 19.72 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 13 రకాల వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు. అందులో అత్యధికంగా ఎంటీయూ–1010 కాటన్‌ దొర సన్నాల వరి రకం విత్తనాలను 5 లక్షల క్వింటాలు సిద్ధం చేసి ఉంచారు. అవి 16 లక్షల ఎకరాలకు సరిపోతాయని నివేదికలో పేర్కొన్నారు. బీపీటీ–5204 సాంబ మసూరి రకం విత్తనాలను 4.80 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేశారు. అవి 15.90 లక్షల ఎకరాలకు సరిపోతాయి. 13 రకాల వరి విత్తనాల్లో ఈ రెండు రకాలే సగం ఉండటం విశేషం. ఈ రెండు రకాలపైనే రైతులు ఆసక్తి చూపుతారని అధికారులు తెలిపారు.  

ఖరీఫ్‌ సీజన్‌కు అందుబాటులో  ఉన్న వరి విత్తన రకాలు 

మరిన్ని వార్తలు