రియల్‌ భూమ్‌ 

18 May, 2019 08:06 IST|Sakshi
ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని బట్టిసావర్గంలోని ఓ వెంచర్‌

రియల్‌ భూమ్‌ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్ధంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది.     రిజిస్ట్రేషన్ల శాఖకు రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. ఉమ్మడి జిల్లాలో ఒకట్రెండు చోట్లు తప్పితే అన్నిచోట్ల దస్తావేజులు (డాక్యుమెంట్ల) సంఖ్య, రెవెన్యూ ఆదాయం గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత     రిజిస్ట్రేషన్ల శాఖకు తొలిసారిగా ఆదాయం పెరగడం గమనార్హం. 

సాక్షి, ఆదిలాబాద్‌: రెవెన్యూ ఆదాయం, దస్తావేజుల సంఖ్య పరంగా పరిశీలిస్తే మంచిర్యాలలో రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట్, ఖానాపూర్‌ వరుసగా నిలిచాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత క్రమంగా ఊపందుకుంటున్న రియల్‌ మార్కెట్‌ 2018–19లో గణనీయంగా పెరిగింది. పట్టణ ప్రాంతం విస్తరించడం, పట్టణ శివారు గ్రామాల్లో రియల్‌ వెంచర్లు జోరుగా వెలుస్తుండడంతోపాటు క్రయ, విక్రయాలు పెరగడంతో మార్కెట్‌ ఊపందుకుంది. అదే సమయంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం వంటి ఆదాయ అభివృద్ధికి కారణం అయ్యాయి.

నిర్మల్‌లో గతేడాది కంటే ఈసారి ఆదాయం తగ్గడం, అదే సమయంలో దస్తావేజుల సంఖ్య కూడా తగ్గింది. ప్రధానంగా గతంలో కుంటాల, లోకేశ్వరం, తానూర్‌కు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు నిర్మల్‌లో జరిగేవి. అయితే వాటిని భైంసాకు తరలించడంతో దస్తావేజుల సంఖ్య తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కుమురంభీం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఆసిఫాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ దస్తావేజుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ 2017–18 సంవత్సరంలో 3,237 దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కాగా, 2018–19 సంవత్సరంలో 3,995కు పెరిగింది.

మార్కెట్‌ విలువతో రిజిస్ట్రేషన్లు..
ఆదిలాబాద్, మంచిర్యాలలో ఓపెన్‌ ప్లాట్లను బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువతో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటుండడంతో రిజిస్ట్రేషన్‌ శాఖకు ఫీజుల రూపంలో అధిక ఆదాయం లభిస్తుంది. ప్లాట్లకు ప్రభుత్వ ధరతో నిర్ణయించిన శాతం ధరతో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంటుంది. అయితే బ్యాంక్‌ లోన్‌ కోసం బహిరంగ మార్కెట్‌లో ఆ ప్లాట్‌ పలుకుతున్న ధర ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు భూయజమాని ఆసక్తి కనబర్చుతున్నారు. దీంతోనే ఆదాయం పెరిగిందని రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్‌ శివారులో మావల, దస్నాపూర్, బట్టిసావర్గాం ప్రాంతాల్లో రియల్‌ వెంచర్లు జోరుగా వెలుస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇదివరకే వెలిసిన ఎన్‌ఓసీ ఉన్న రియల్‌ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను గత ఆరు నెలలుగా నిలిపివేశారు. అయినా ఇక్కడ ఆదాయం పెరగడం గమనార్హం. ఒకవేళ ఎన్‌ఓసీ వెంచర్లలో కూడా రిజిస్ట్రేషన్ల ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పక్షంలో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.

మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఉద్యోగులకు రూ.10లక్షల వడ్డీ రాయితీ రుణం ఇస్తుండడంతో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దస్తావేజుల సంఖ్య మంచిర్యాలలో భారీగా పెరిగింది. నస్పూర్, క్యాతన్‌పెల్లి, తిమ్మాపూర్‌ ప్రాంతాల్లో రియల్‌ వెంచర్లలో క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారు చెన్నూర్, కోటపల్లి ప్రాంతాల్లో సారవంతమైన వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం కూడా ఇవి పెరగడానికి కారణమైనట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మంచిర్యాల–మహారాష్ట్రలోని సిరొంచ వరకు ప్రాణహితపై బ్రిడ్జి కావడంతో ఛత్తీస్‌ఘడ్‌ వరకు రాకపోకలు పెరిగాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భూ క్రయ, విక్రయాలు జోరందుకోవడానికి ఇది కూడా ఓ కారణమని పేర్కొంటున్నారు.

 భైంసాలో భూ క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలు అధికంగా ఉండడంతో పట్టణ పరిసరాలు వృద్ధి చెందడంతో పాటు వ్యవసాయ భూములు పెద్ద మొత్తంలో ఒకేచోట దొరికే పరిస్థితి ఉండటం కూడా రియల్‌ వృద్ధికి కారణమవుతోంది. 10, 20, 30, 40 ఎకరాలు ఒకేచోట లభ్యమయ్యే పరిస్థితి ఉండడం, కెనాల్‌ సదుపాయంతో నీరు సమృద్ధిగా ఉండడంతో పలువురు బల్క్‌గా వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల రూపంలో పలువురు వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తుండటంతో ఇక్కడ దస్తావేజుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. భైంసా, బాసర, మాటెగాంలలో ఓపెన్‌ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయం అధికంగా ఉండటం, బాసర అమ్మవారి ఆలయం, ట్రిపుల్‌ఐటీ కారణంగా ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. భైంసా పట్టణంలో రాహుల్‌నగర్, నిర్మల్‌రోడ్, బస్టాండ్‌ ఏరియాల్లో ఓపెన్‌ ప్లాట్ల క్రయ, విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. 

దస్తావేజులు, ఆదాయం పెరిగింది
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. గతేడాది కంటే ఈసారి రూ.15కోట్లు అధిక ఆదాయం వచ్చింది. మంచిర్యాల, ఆదిలాబాద్, భైంసాలో రెవెన్యూ ఆదాయం అధికంగా ఉంది. మిగతా చోట్ల కూడా దస్తావేజుల సంఖ్య పర్వాలేదు. – రవీందర్‌రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు