నమ్మక ద్రోహం చేయలేనంటూ...తనువు చాలించాడు

4 Mar, 2015 22:28 IST|Sakshi

నిజాంసాగర్(నిజామాబాద్): సుమారు మూడున్నర కోట్ల రూపాయల అప్పు తీర్చలేక, నమ్మిన వారిని మోసం చేయలేక రియల్ ఎస్టేట్ వ్యాపారి నాయిని సత్యనారాయణ రెడ్డి (65) నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకాడు. పోలీసుల కథనం.. నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం గండివేట్ గౌరారం గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లోని పాత బోయినపల్లిలో స్థిరపడ్డారు. సర్దార్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేసి, ఐదేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఇందుకోసం స్నేహితులు, బంధువుల వద్ద రూ.3 కోట్ల వరకు అప్పు చేశారు.

రుణదాతలు తరచూ ఫోన్లు చేస్తుండటంతో రెండు రోజుల కిందట హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, పిట్లం మండలాలలో ఉన్న బంధువుల వద్దకు వచ్చారు. వారితో మాట్లాడిన అనంతరం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరారు. అప్పటికే ఆత్మహత్య కోసం సిద్ధమైన సత్యనారాయణరెడ్డి ఇందుకు గల కారణాలను తన వద్ద ఉన్న నోట్‌బుక్కులో రాసుకున్నారు. ఎల్లారెడ్డి బస్టాండ్‌లో బస్సు దిగినిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని అందులో దూకాడు. బుధవారం మృతదేహమై కనిపించాడు. సత్యనారాయణరెడ్డికి భార్య భాగ్యమ్మ, కూతుళ్లు సరిత, స్వప్న, సబిత ఉన్నారు. వీరి వివాహాలు కావడంతో ఆమెరికా, దుబాయిలో స్థిరపడ్డారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఈయన బంధువు కూడా. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం హైదరాబాద్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు