పుర పోరులో ‘రియల్‌ ఎస్టేట్‌’ దూకుడు! 

13 Jan, 2020 08:21 IST|Sakshi

పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు

తమ అనుచరులతోనూ వేయించిన వ్యాపారులు

కౌన్సిలర్‌ స్థానాలు, చైర్మన్‌గిరిపై కన్ను

పార్టీ టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకున్నా పోటీకి సై

ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధం

డబ్బు సంచులతో దిగుతున్న వైనం

సాక్షి, యాదాద్రి : డబ్బుంది.. పలుకుబడి ఉంది.. కావాల్సిందల్లా అధికారమే..! అందుకోసమే ఎంతఖర్చయినా సిద్ధమే.!! మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దూకుడు పెంచారు. ఎలాగైనా పార్టీ టికెట్‌ దక్కించుకొని చైర్మన్‌గిరి పట్టాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో హెచ్‌ఎండీఏ పరిధిలో భువనగిరి, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి,  వైటీడీఏ పరిధిలో యాదగిరిగుట్ట, భువనగిరి, జాతీయ రహదారి వెంట ఆలేరు మున్సిపాలిటీ ఉంది. ఆయా మున్సిపాలిటీల్లో రియల్‌ ఎస్టేట్‌  వ్యాపారులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అనుకూలంగా రిజర్వేషన్‌ రాని వారు పక్క వార్డుల నుంచి నామినేషన్‌ వేశారు. అంతేకాకుండా చైర్మన్‌ గిరిపై కన్నేసి ఇతర వార్డుల్లోనూ తమ అనుకూల వ్యక్తులను పోటీలో దింపేందుకు వారితో నామినేషన్లు వేయించారు. ఖర్చు కూడా వారే భరించనున్నారు. 

డబ్బుల సంచులతో సిద్ధం
వివిధ పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు టికెట్‌ కోసం చూస్తున్నారు. తమకు పార్టీ టికెట్‌ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నవారు చైర్మన్‌ గిరిపై కన్నేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్‌ బీసీ జనరల్, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి బీసీ మహిళ, మోత్కూర్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే రియల్టర్లు పెద్ద సంఖ్యలో పోటీలోకి దిగుతున్నారు.  నామినేషన్‌ వేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా ఎక్కువ మంది రియల్టర్లు రంగంలోకి దిగారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగడంతో జిల్లాలో పలువురు కోట్ల రూపాయలు గడించారు.

రిజర్వేషన్‌లు అనుకూలంగా రావడంతో ఎలాగైనా చైర్మన్‌ పీఠం దక్కించుకోవాలని రూ.2కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఈవిషయాన్ని పార్టీ అధిష్టానం వద్ద చెబుతూ చైర్మన్‌గిరి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పోటీ తీవ్రం కావడంతో అధికార పార్టీలో చైర్మన్‌ అభ్యర్థుల పేరు ముందుగా ప్రకటించడం లేదు. గెలిచిన తర్వాత చైర్మన్‌ పేరు ప్రకటిస్తామని చెప్పడంతో ఎవరికి వారు రేసులో దూసుకుపోతున్నారు. బీసీలకు చైర్మన్‌ సీటు రిజర్వ్‌ కావడంతో పోటీదారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌లో ఖర్చుకు వెనుకాడకుండా ఆశావహులు ముందుకుసాగుతున్నారు. 

కౌన్సిలర్‌ స్థానాలకు సైతం..
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలవడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడేది లేదంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగారు. భువనగిరి మున్సి పాలిటీలో అధికార పార్టీ మెజార్టీ సీట్లను కొత్తవారికి కేటాయించడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీలో సైతం డబ్బు సంచులతో వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారు.

రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు చే యడానికి వెనుకాడేది లేదని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు మొండిచేయి చూపుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బు లేదన్న కారణంతో చైర్మన్‌ అభ్యర్థులతో పాటు కౌన్సిలర్లుగా పోటీపడే వారికి కూడా టికెట్లు దక్కడం లేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. 

అందని బీఫారాలు
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులకు ఇంకా ఖరారు చేయలేదు. అధికార పార్టీలో పెద్ద ఎత్తున రెబెల్స్‌ బెడద ఉండడంతో బీఫారాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. మోత్కూరులో టీఆర్‌ఎస్‌ పూర్తి జాబితా ప్రకటించగా.. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీల్లో  కొందరికి బీఫారాలు ఇచ్చింది. మిగతా వారికి ఇవ్వడంలో జాప్యం చేస్తోంది. ఎక్కువ మంది పోటీ ఉండటం వల్లే బీ ఫారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అభ్యర్థులు నామినేషన్‌లు వేసి బీఫారాల కోసం నాయకత్వం చుట్టూ తిరుగుతున్నారు. ప్రధానంగా డబ్బు ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమేనంటూ టికెట్లు ఆశించే అభ్యర్థులు అధిష్టానాన్ని కోరుతున్నారు.

కొందరు పార్టీ పేరుతో నామినేషన్‌లు వేసినప్పటికీ టికెట్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఆయా వార్డుల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి ముందుకు వస్తున్న ఆశావహులకు అవకాశం కల్పించే పరిస్థితి ఉందని తెలుస్తోంది. డబ్బు ప్రభావం అన్ని పార్టీల్లో స్పష్టంగా కనిపించడం వెనక రియల్టర్లు పెద్ద ఎత్తున పోటీకి దిగడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ టికెట్‌ రాకున్న పోటీ నుంచి తప్పుకునేది లేదని, పోటీలో ప్రధాన అభ్యర్థులకు ధీటుగా ఖర్చు చేసి విజయం సాధిస్తామని పలువురు రాజకీయ రియల్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగాలని బావిస్తున్నారు. ఏది ఏమైనా  మున్సిపల్‌ ఎన్నికల్లో వరదలా డబ్బు ఖర్చు చేయడం ఖాయమని తెలుస్తోంది. 
చదవండి: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని హతమార్చిన భార్య, కుమారులు

మరిన్ని వార్తలు